‘స్పైడర్’తో బాహుబలి రేంజ్ హిట్

మురగదాస్ – మహేష్ బాబుల ‘స్పైడర్’ దసరా కానుకగా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దాదాపు రూ. 120కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రమిది. ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ కి బాహుబలి రేంజ్ హిట్ ఖాయమని ఆయన అభిమానులు చెప్పుకొంటున్నారు.

రాజమౌళి ‘బాహుబలి’ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ బాషల్లో రిలీజైంది. ఇండియాలో ఎక్కడికెళ్లిన అక్కడ నెం.1 స్థానంలో నిలిచింది. అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమా రికార్డు సృష్టించింది. బాలీవుడ్ సినిమాలకే సాధ్యం కానీ వసూళ్లని రాబట్టింది. ఇక, టాలీవుడ్ లో రికార్డులన్నీ బాహుబలికి దాసోహం అయ్యాయి. మరీ.. ఇప్పుడు బాహుబలి రికార్దులని చెరిపేయగల సత్తా మహేష్ స్పైడర్ కు ఉందా ? అన్నదే ప్రశ్న.

దర్శకుడు మురగదాస్ సినిమాలకి కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఉంది. ఓ సామాజిక సమస్యకి కమర్షియల్ హంగులు తీర్చిదిద్ది తెరకెక్కించడంలో మురగదాస్ దిట్ట. ఇప్పుడు స్పైడర్ విషయంలోనూ అదే చేశాడని చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, చెన్నై, ముంబై, పూణే లలో చిత్రీకరించిన యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయట. స్పైడర్ యాక్షన్ కి జాతీయ అవార్డు రావొచ్చని కూడా చెబుతున్నారు.

రిలీజ్ కి ముందే స్పైడర్ ప్రీ-రిలీజ్ రూ. 200కోట్లు దాటిందని చెబుతున్నారు. గతంలో ‘శ్రీమంతుడు’ సినిమాతో నాన్ బాహుబలి రికార్డులన్నీ చెరిపేశాడు మహేష్. ఆ సినిమా కేవలం తెలుగులో మాత్రమే రిలీజైంది. ఈ సారి స్పైడర్ తెలుగుతో పాటు, తమిళ్, హిందీల్లోనూ రిలీజ్ కాబోతుంది. ఈ లెక్కన మహేష్ స్పైడర్ బాహుబలి రేంజ్ లో హిట్ అందుకొంటాడని అంచనా వేయడం గొంత్తెమ్మ కోరిక ఏం కాదేమో.. !!