‘సోషల్’ సోయి.. గిప్పుడొచ్చింది !

ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండు నడుస్తోంది. ఈ ట్రెండుని రాజకీయ పార్టీలు పుణికిపుచ్చుకొని మరింత బలపడే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, సోషల్ మీడియా వాడకంలో తెలుగు రాష్ట్రాల్లోని టీఆర్ఎస్, టీడీపీ, భాజాపా ముందున్నాయి. కాంగ్రెస్’కు మాత్రం సోషల్ సోయి ఇప్పుడిప్పుడే వస్తోంది. ఈ మధ్య టీ-కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వాడకంపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే.

టెక్నాలజీ వాడకంలో టీడీపీ ఎప్పుడు ముందుంటుంది. ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబుని ఏకంగా టెక్ బాబు అని పిలుచుకొంటుంటారు. పేపర్ లెస్ కేబినేట్ సమావేశాలని దేశంలో మొట్టమొదటిసారిగా అమలు చేసిన రికార్డుని చంద్రబాబు కేబినేట్ సొంతం చేసుకొంది. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టెక్నాలజీకి పెద్ద పీఠ వేస్తున్నారు. ఈ యేడాదియే కేసీఆర్ ఫేస్ బుక్ ఖాతా తెరిచారు. టెక్నాలజీ మంత్రిగా ఉన్న కేసీఆర్ తనయుడు కేటీఆర్ తన ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా నెట్ వర్క్స్ ద్వారా వచ్చిన సమస్యలపై స్పందిస్తూ.. వాటిని పరిష్కరిస్తున్నారు. మంత్రి హరీష్ రావు.. మరి కొందరు టీఆర్ ఎస్ నేతలు సోషల్ సోయిని కలిగి ఉన్నారు.

ఈ విషయంలో కాంగ్రెస్ మాత్రం అట్టడుగున ఉంది. ఇటీవలే హైదరాబాద్ శంషాబాద్ లో సోషల్ మీడియా వాడకంపై కార్యకర్తలకి శిక్షణా తరగతులని కూడా నిర్వహించింది టీ-కాంగ్రెస్. అంతేకాదు.. అతి త్వరలోనే టీ-కాంగ్రెస్ ఓ టీవీ ఛానెల్, ఓ పత్రికని తీసుకొస్తున్నట్టు టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరి.. సోషల్ సోయిలోకి కాస్త ఆలస్యంగా వచ్చిన టీ-కాంగ్రెస్ వచ్చే సాధారణ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ని ఏ మేరకు ఎదుర్కోగలదన్నది చూడాలి.