డీఎస్సీకి పరీక్ష…
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ నిరుద్యోగులను నిరాశే మిగిల్చిందట. ఎంతో ఆశగా ఖాళీలుంటాయని ఆశించిన వారికి ఆశాభంగం కలిగిందట. పేరుకు పెద్ద సంఖ్యలో ఖాళీలు కనిపించినా అందులో ఉద్యోగాలు తక్కువేనని నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కొత్త జిల్లాల వారిగా టీఆర్టీ నోటిఫికేషన్ వేయడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొంతమంది ఈ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కొత్తజిల్లాలవారిగా కాకుండా పాత జిల్లాల వారిగా నోటిఫికేషన్ వేయాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ప్రభుత్వం హైకోర్టును వారం రోజుల గడువు కోరింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ సలహా తీసుకుని అభిప్రాయం చెబుతామని కోర్టుకు విన్నవించింది. న్యాయపరంగా అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. ఈ నోటిఫికేషన్ కోర్టు మెట్లు దాటే దాకా కష్టమే అనే అభిప్రాయం వెలువడుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టు పనులు కూడా చాలావరకు కోర్టులో పెండింగ్ లో ఉండటంతో ఈ అంశం కూడా వాయిదా పడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి చాలామందిలో.. మరి అనుకున్న గడువులోగా కోర్టు మెట్లు దాటి టీఆర్టీ పరీక్ష జరుగుతుందా.. లేక వాయిదా ల పద్దతే కొనసాగుతుందా చూడాలి మరి..