కేసీఆర్ సెంచ‌రీ కొడ‌తాడా.. !

కేసీఆర్ సెంచ‌రీ కొడ‌తాడా…

ఇన్నాళ్లుగా టీఆర్ఎస్ నేత‌ల్లో ఉన్న డైలామాకు సీఎం కేసీఆర్ తెరదించార‌ట‌. మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు, ప‌రిస్థితుల నేప‌థ్యంలో వ‌చ్చేఎన్నిక‌ల్లో అధికార పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయోన‌నే ప్ర‌శ్న ఆ పార్టీ నేత‌ల్లో ఉండేద‌ట‌. ఎల్పీ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి నేత‌ల్లోఉన్న భ‌యాన్ని తొల‌గించేశార‌ట‌. 2019లో కూడా అధికారం మ‌న‌దే అంటూ అంద‌రికీ క్లారిటీ ఇచ్చార‌ట‌. అన్ని స‌ర్వేలు టీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయ‌ని, 95 నుంచి 104 సీట్లు మ‌న‌వే అంటూ ఎమ్మెల్యేల ముందు ధీమా వ్య‌క్తం చేశార‌ట‌. ఎప్పుడు స‌మావేశం జ‌రిగినా ఎమ్మెల్యేల ప‌నితీరుపై స‌ర్వే రిపోర్టుల‌ను బ‌య‌ట‌పెట్టే సీఎం ఇప్పుడు అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై కొంత‌మందిని డైలామాలో ప‌డేసినా.. ఓవ‌రాల్ గా రాష్ట్రంలో సెంచ‌రీ కొట్టేస్తామ‌న్నా ఒక ధీమా వ‌చ్చేసింద‌ట‌.

నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల మ‌ధ్య వ్య‌వ‌హారాలు శృతిమించ‌డంపై సీఎం గట్టిగా స్పందించార‌ట‌. ఒక‌రి వ్య‌వ‌హారాల్లో ఒక‌రు త‌ల‌దూరుస్తూ గొడ‌వ‌లు పెట్టు కోవ‌డం ఏంట‌ని మంద‌లించార‌ట కూడా. ఇప్ప‌టికే అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు బ‌య‌ట‌ప‌డుతున్న నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో సెంచ‌రీ కొట్టడం సాధ్య‌మేనా అనే అనుమానాలు కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది కాలం ఉన్నందున్న ఎప్పుడు ఏం జ‌రుగుతుందో.. రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఎలా మార‌తాయో చెప్ప‌లేని ప‌రిస్థితి.. మ‌రి సీఎం ఏ అంచ‌నాతో , ఎలా లెక్క‌లు వేసుకుని చెప్పారోగానీ… అనుకున్న‌ట్లుగా సెంచ‌రీ కొడ‌తారో లేదో.. చూడాలి మ‌రి..