మంత్రి కేటీఆర్ కు డ్రగ్స్ తో సంబంధం…?
నిత్యం ఏదో ఒక అంశంతో హాట్ టాపిక్ గా నిలుస్తున్న టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో బాణం విసిరారు. అది మామూలు బాణం కాదు.. ఏకంగా మంత్రి కేటీఆర్ డ్రగ్స్ సరఫరాను ప్రోత్సహిస్తున్నారన్న కామెంట్స్ ఇప్పుడు హాట్ హాట్ చర్చకు తావిస్తోంది. సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు చదువుతున్న స్కూల్లో కూడా డ్రగ్స్ వాడుతున్నారని, పోలీసులు కూడా నోటీసులు ఇచ్చారని ఆయన చెప్పారు. మంత్రి కేటీర్ కు డ్రగ్స్ తో సంబంధం ఉందనే అనుమానం ఉందని , కేటీఆర్ కూడా రక్త నమూనా, వెంట్రుకలు విచారణకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో డ్రగ్స్ పై తాను అడిగిన ప్రశ్నకు బదులు ఇవ్వకుండానే సభను వాయిదా వేయడంపై ఆయన మండి పడ్డారు. ఒక వేళ తాను సభకు రాకపోయినా సమాధానం రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల కు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని, బామ్మర్ది కళ్ళలో అనందం చూడటం కోసం.. కేటీఆర్ రాజ్ పాకాల కు అప్పగించారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వంలో ఉండి నేతలు దుర్మార్గమైన వ్యాపారం చేస్తున్నారని, చిన్న పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికే డ్రగ్స్ విషయంపై సుప్రీం కోర్డు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేశానన్నారు. పక్కా ఆధారాలతోనే ఆరోపణలు చేస్తున్నానని, దమ్ముంటే తనపై కేసు పెట్టుకోవచ్చని ఆయన సవాల్ విసిరారు.