ప్రివ్యూ : ఉన్నది ఒక్కటే జిందగీ
యూత్’లో మాంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో రామ్. అందుకు తగ్గట్టుగానే ఈ ఎనర్జిటిక్ హీరో తెరపై తన ఎనర్జినంతా ప్రదర్శిస్తుంటాడు. కానీ, ఫలితాలు రావడం లేదు. అన్నీ సినిమాల్లోనూ ఎనర్జి చూపిస్తే ఎలా ? కథకు తగ్గట్టుగా బ్యాలెన్సిడ్ గా నటించాల్సి ఉంటుంది. ‘నేను శైలజ’ సినిమాలో రామ్ అదే చేశాడు. ఇక, రామ్ మారాడు. ఇకపై అన్నీ హిట్సే అనుకొన్నారు. ఇంతలో ‘హైపర్’తో మళ్లీ తన ఎనర్జీని వీర లెవల్లో చూపించేశాడు. తమ అభిమాన హీరో మళ్లీ పాత ట్రాక్ లోకి వెళ్లడం ఆయన అభిమానులకి ఏమాత్రం నచ్చలేదు. ఇప్పుడు మరోసారి నేను శైలజ దర్శకుడు కిషోర్ తిరుమలతో కలిసి ‘ఉన్నది ఒక్కటే జిందగీ ‘ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఉన్నది ఒక్కటే జిందగీ.. ఓ జీవితం. స్నేహం, ప్రేమ నేపథ్యంలో సాగే కథ ఇది. యూత్ కి కిక్కునిస్తే.. పెద్దలకి తమ యూత్ గా ఉన్నప్పుడు చేసిన విషయాలని గుర్తు చేసే చిత్రమని చెబుతున్నారు. ఈ సినిమాపై రామ్ నమ్మకంగా ఉన్నాడు. నమ్మదగిన దర్శకుడు. కొత్త లుక్, యూత్ ని ఆకట్టుకొనే అంశాలు పుష్కలంగా ఉన్న కథ. ఓ సినిమాపై నమ్మకం పెరగడానికి ఇంతకన్నా ఏం కావాలి ?
‘నేను శైలజ’తో టాలీవుడ్ కి కీర్తి సురేష్ రూపంలో ఓ ఆణిముత్యాన్ని పరిచయం చేశాడు. ఈ సినిమాలోనూ అనుపమని ఆణిముత్యంలా చూపించినట్టు చెబుతున్నారు. ఆమె పాత్ర సినిమాకే హైలైట్ గా నిలవనున్నట్టు చెబుతున్నారు. లావణ్య త్రిపాఠి ఈ సారి గ్లామర్ డోస్ పెంచనుంది. మొత్తానికి.. రిలీజ్ కి ముందే హిట్ టాక్ తో.. హిట్ కొడతామన్న కసితో రామ్ టీం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మరీ.. ప్రేక్షకుల రిపోర్ట్ ఏంటన్నది చూడాలి.