టీడీపీకి రేవంత్ రెడ్డి రాజీనామా?


కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకే నేరుగా రాజీనామా లేఖ ఇచ్చే అవకాశం ఉందంటూ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఓ ప్ర‌చారం మొద‌లైంది. టీడీపీని వీడేందుకు గల కారణాలను బాబుకు వివరిస్తార‌ని, తెలంగాణలో పరిస్థితులను, పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలను అధినేత దృష్టికి తీసుకెళ్లాలని రేవంత్ భావిస్తున్నారట‌. చంద్ర‌బాబుతో టీటీడీపీ ముఖ్య నేతలు సమావేశంలో రేవంత్ అంశమే ప్రధానంగా చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి విషయంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని టీటీడీపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు.

రేవంత్‌ రెడ్డి గురువారం శాసనసభాపక్ష కార్యాలయానికి వెళ్లిన‌పుడు అదే సమయంలో అక్కడకు వచ్చిన కాంగ్రెస్ నేతలు రేవంత్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని.. కొద్దిసేపు ముచ్చటించారు. ‘వెల్‌కం.. వెలకం’ అంటూ రేవంత్‌తో కరచాలనం చేశారు కూడా.. ఆ తర్వాత నేరుగా, టీడీఎల్పీలోకి వెళ్లిన రేవంత్ అక్కడున్న శాసనసభపక్ష నేత కుర్చీలో కాకుండా, మరో కుర్చీలో కూర్చున్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే రేవంత్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.