ఇక కాంగ్రెస్ గూటికే..

గ‌త కొంత కాలంగా టీటీడీపీలో తో పాటు రెండు తెలుగు రాష్ట్రల్లో హాట్ టాపిక్ గా మారిన రేవంత్ ఎపిసోడ్ కు తెర‌ప‌డింది.. అమ‌రావ‌తిలో చంద్ర‌బాబుతో జ‌రిగే టీటీడీపీ నేత‌ల స‌మావేశంలో రేవంత్ వ్య‌వ‌హారం తేల్చేస్తార‌నుకున్న టీటీడీపీ నేత‌ల అంచ‌నాల‌ను తారుమారు చేశారు రేవంత్. ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం పార్టీ అధినేత వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శికి రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించి ట్విస్ట్ ఇచ్చారు. పార్టీకీ , పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్న‌ట్లు లేఖ‌లో పేర్కొన్నారు. పార్టీలో త‌న ఎదుగుద‌ల‌కు ఎన్నో అవ‌కాశాలు క‌ల్పించిన చంద్ర‌బాబుకు ఎప్పుడూ రుణ‌ప‌డి ఉంటానంటూ ఒక‌వైపు చెబుతూనే టీటీడీపీ నేత‌ల వైఖ‌రి బాధించిందంటూ లేఖ‌లో పేర్కొన్నార‌ట‌.

వ్యూహాత్మ‌కంగా రాజీనామా అస్త్రాన్ని సంధించిన రేవంత్.. ఇక కాంగ్రెస్ లో చేర‌డం లాంఛ‌న‌ప్రాయ‌మైంది. అందులో భాగంగానే డిసెంబ‌ర్ 9 నుంచి యాత్ర చేస్తాన‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. స‌రిగ్గా సోనియా గాంధీ పుట్టిన రోజు నుంచే యాత్ర‌ను ప్రారంభిస్తాన‌ని చెప్పడం తాను కాంగ్ర‌స్ లోకి వెళుతున్న‌ట్లుగా సంకేతాలు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ లోపు రాహుల్ స‌మ‌క్షంలో పార్టీలో చేర‌తార‌ని, ఆత‌రువాత అనుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం యాత్ర‌ను చేప‌డ‌తార‌ని తెలుస్తోంది..