రేవంత్ లేఖలో ఏముంది…?
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన లేఖలో తన రాజీనామాకు కారణాలను సవివరంగా రాసినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా బాధించాయని, పార్టీలో తక్కువ సమయంలో ఉన్నతస్థాయిలో ఎదిగేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఏపీ, టీటీడీపీ సీనియర్ నాయకులు తమ స్వార్థం కోసం ఇతర పార్టీ నేతలతో చేతులు కలిపి టీటీడీపీని నాశనం చేస్తున్నట్లు కూడా పేర్కొన్నారట.
తాను కేసీఆర్ తో పోరాటం చేస్తుంటే కొందరు నేతలు ఆయనతో కలిసి సమావేశమై ప్రభుత్వంతో లాలూచీ పడి కాంట్రాక్టులు తెచ్చుకున్నారని, అలాంటప్పుడు తన పోరాటానికి విలువ ఉంటుందా అని లేఖలో ప్రశ్నించారట. ఇప్పటికే మాటల సందర్భంలో పరిటాల కుటుంబం, యనమల, పయ్యావుల , మోత్కుపల్లిలాంటి నాయకులపై ఆరోపణలు చేసినా రాజీనామా లేఖలో రాయకుండా కేవలం ప్రస్తావన మాత్రమే తీసుకువచ్చారట.
తెలంగాణలో టీడీపీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటానని, కార్యకర్తలు తనకు ప్రాణ సమానమని, అయితే తన పోరాటం మాత్రం ఎప్పుడూ కేసీఆర్ , టీఆర్ఎస్ పార్టీపైనేనని స్పష్టంచేశారట. కొడంగల్ లో కార్యకర్తలతో చర్చించాకనే ఏదైనా నిర్ణయం తీసుకుంటానని, తన రాజీనామా లేఖలో రేవంత్ ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీలో ఉండి, కేసీఆర్ తో స్నేహం చేస్తున్న నాయకుల విషయంలో ఆవేదన చెంది పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా లేఖలో వెల్లడించారట.