వికలాంగులతో రవితేజ
తాజాగా రవితేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమా విజయవంతమైన నేపథ్యంలో సినిమా యూనిట్ ఓ షో కు ప్లాన్ చేసింది. వికలాంగులు, వృద్దులకు సినిమా చూపించాలని భావించింది. అందుకే రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘం డైరెక్టర్ ఆధ్వర్యంలో అందరినీ ధియేటర్ కు తీసుకు వచ్చారట. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ ధియేటర్ సందడిగా మారింది.
సినిమాలో వికలాంగుడిగా నటించిన రవితేజను చూడటానికి 1200 మందికిపైగా వికలాంగులు, వృద్దులు ధియేటర్ కు తరలివచ్చారట. నిర్మాత దిల్ రాజు, హీరో రవితేజతో పాటు మరికొంత మంది చిత్ర యూనిట్ వికలాంగులతో కలిసి సినిమా చూశారు. ఆత్మస్థైర్యం ఉంటే అంగవైకల్యం అడ్డు కాదంటూ సందేశాత్మకంగా తీసిన ఈ చిత్రాన్ని చూసి అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.