అందుకే ఎమ్మెల్యేగా రాజీనామా..?
రేవంత్ పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేయడంతో పాటు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నట్లుగా లేఖను ఇవ్వడం తెలుగు రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తారని అందరూ ముందే ఊహించినా , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం మాత్రం ఊహించని పరిణామంగా భావిస్తున్నారు. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలంటూ రేవంత్ ఘాటుగా స్పందించారు. తాజా పరిణామాల నేపథ్యంలో తనపై ఎలాంటి విమర్శలకు తావులేకుండా చేసుకోవాలని రేవంత్ భావించినట్లు తెలుస్తోంది.
అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ లేఖ ను చంద్రబాబుకు సమర్పించి విమర్శలకు చెక్ పెట్టారు. అటు అధికార టీఆర్ఎస్ పార్టీ, ఇటు టీటీడీపీ నేతలు మాట్లాడకుండా చేశారు. ఒకవేళ స్పీకర్ రాజీనామాను ఆమోదిస్తే ఉప ఎన్నిక ద్వారా తానేంటో నిరూపించుకునే అవకాశం ఉంటుందని, అధికార పార్టీకి గట్టి సవాల్ విసినట్లు అవుతుందనేది ఆయన భావించారట. రాజీనామా ఆమోదించకపోయినా తనను ఎదుర్కొనే ధైర్యం లేక ప్రభుత్వం వెనకడుగు వేసిందనే సంకేతాలను పంపించవచ్చని అందుకే ఎమ్మెల్యేగా రేవంత్ రాజీనామా చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద ఒక రకంగా రేవంత్ ఎపిసోడ్ ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతుందనే చెప్పొచ్చు.