తెలంగాణలో టీడీపీ ఔట్..
రేవంత్ కాంగ్రెస్ లో చేరిక ఖరారైన నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. టీటీడీపీలో మొదట్లో మొత్తం 15మంది ఎమ్మెల్యేలు ఉండగా టీఆర్ఎస్ ఆకర్ష్ తో చాలామంది ఆ పార్టీలో చేరిపోయారు. పదవులు లేని ముఖ్య నాయకులను కూడా అధికారలో ప్రాధాన్యమిచ్చి చేర్చుకున్నారు. ఇప్పుడు రేవంత్ పార్టీ వీడటంతో టీటీడీపీలో ఇప్పుడు మిగిలింది ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే. రేవంత్ కాంగ్రెస్ లో చేరిన తరువాత పరిణామాలను బట్టి ఈ ఇద్దరిలో ఒకరు కూడా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఎమ్మెల్యే ఆర్.క్రిష్ణయ్య కూడా టీడీపీ నేతగా కంటే బీసీ నాయకు తనిగానే ఎక్కువగా పనిచేస్తున్నారు. చాలాచోట్ల పలు సందర్భాల్లో బీసీలకు న్యాయం జరగకపోతే పార్టీ పెడతానంటూ ప్రకటించారు కూడా . ఎన్నికల నాటికి ఆయన కూడా పార్టీ పెట్టే అవకాశం కనిపిస్తున్నందున ఆర్.క్రిష్ణయ్య కూడా పార్టీ వీడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక టీటీడీపీలో మిగిలిన మరికొంత మంది ముఖ్య నేతలు కూడా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నాటికి పొత్తుల పరిస్థితిపై క్లారిటీ వచ్చిన తరువాత వారు నిర్ణయం తీసుకుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో తెలంగాణలో ఇక టీడీపీ ఖాళీ అయినట్లేనని, పేరుకే ఆ పార్టీ ఉంటుందంటున్నారు కొందరు.