కొడంగల్ లో ప్ర‌జా బ్యాలెట్..

రేవంత్ పార్టీని వీడి పోవ‌డంతో త‌దుప‌రి క‌ర్త‌వ్యం ఏమిట‌నేదానిపై టీటీపీ నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. ఎన్టీఆర్ భ‌వ‌న్ లో స‌మావేశ‌మైన టీటీడీపీ నేత‌లు రేవంత్ రాజీనామా అనంత‌ర ప‌రిణామాల‌పై పార్టీ, బ‌లోపేతం చ‌ర్చించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో రేవంత్ అనుచ‌రులు ఆయ‌న వెంట వెళుతున్న నేప‌థ్యంలో పార్టీని ఎలా కాపాడుకోవాలి.. ఎలా ముందుకు తీసుకెళ్లాల‌నే అంశంపై తీవ్రంగా చ‌ర్చించారు.

కొడంగల్ లో ఉప ఎన్నిక వ‌స్తే ఏం చేయాల‌నేదానిపై విస్తృతంగా చ‌ర్చించార‌ట‌. పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, పెద్ది రెడ్డి, గరికపాటి మోహన్ రావు, అరవింద్ కుమార్ గౌడ్, ఉప్పలపాటి అనూషా రాం. బుచ్చిలింగంతో పాటు పలువురు నేతలు త‌మ అభిప్రాయాలు తెలిపారు. అస‌లు ఉప ఎన్నిక‌లో పోటీ చేయాలా వ‌ద్దా, పోటీచేస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నేదానిపై స్ప‌ష్ట‌త రావాల‌ని వారు ఆలోచించారు. అందుకే కొడంగ‌ల్ లో ప్ర‌జా బ్యాలెట్ ను నిర్వ‌హించాల‌ని ఈ స‌మావేశంలో నిర్ణ‌యించారు. న‌వంబ‌ర్ 2న చంద్ర‌బాబు స‌మ‌క్షంలో రాష్ట్ర స‌ర్వ‌స‌భ్య స‌మావేశం నిర్వ‌హించనున్నారు.