కేసీఆరేనా.. ఎన్టీఆర్ కూడా దొరేనట..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే దొర కాదని, ఎన్టీఆర్ కూడా దొరేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారట. అసెంబ్లీ లాబీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యే కు సండ్ర కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఎప్పుడు వస్తున్నారంటూ సండ్రను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. దీంతో సండ్ర నేను రాను , దొరల పాలన మనకెందుకు, మీరే టీడీపీలోకి రండి అంటూ సమాధానం చెప్పారట. దీంతో టీఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్ కూడా దొరే కదా అంటూ బదులిచ్చారట. ఎన్టీఆర్ దొరైనా ఆయన బడుగుల పక్షాన నిలిచారు కదా అంటూ సండ్ర చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ కూడా బలహీనవర్గాల పక్షాన ఉన్నారంటూ టీఆర్ఎస్ నేతలు సమర్థించుకున్నారట.
ఇన్నేళ్లుగా ఎన్టీఆర్ ను దొరగా ఎవరూ అభివర్ణించలేదు. విపక్ష నేతలు కూడ ఆయన్ను ఎంతో గౌరవించేవారు. ఇన్నాళ్ల తరువాత టీఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్ ను దొర అనడం పై రాజకీయ వర్గాల్లో ఒక చర్చకు దారితీస్తోంది.. ఎన్టీఆర్ ను దొర అనడం ఏమో కానీ, కేసీఆర్ దొర అని టీఆర్ఎస్ నేతలే ఒప్పుకున్నారు కదా అని గుసగుసలాడుకుంటున్నారట కొందరు.