పోలీసులమని చెప్పి 5లక్షలు దోపిడీ.
పోలీసులమని చెప్పి ఓ వృద్ధుడి వద్ద నుంచి రూ.5 లక్షలు దోపిడీ చేశారు దుండగులు. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి మోహన్ స్వర్ణపాల్(63)…. ఉప్పల్‌లోని కల్యాణపురిలో ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. సాయంత్రం ఆనంద్‌బాగ్‌లోని బ్యాంకు నుండి రూ.7 లక్షల 60 వేలు నగదు డ్రా చేశాడు. ఇంటి నిర్మాణం కోసం డబ్బులు చెల్లించడానికి రూ.5 లక్షల 34 వేలతో ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఉప్పల్‌లోని మెట్రోస్టేషన్ కల్యాణపురి ప్రాంతం వైపు వెళ్లే మార్గంలోకి రాగానే.. ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి మోహన్ స్వర్ణపాల్ వాహనం ఆపారు.
తాము పోలీసులమంటూ వాహనం తనిఖీ చేశారు. ఇతర వస్తువులతో పాటు డబ్బుల బ్యాగును తీశారు. బ్యాగుతోపాటు ద్విచక్ర వాహనం కీ తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు రమ్మని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో స్వర్ణపాల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా తాను మోసపోయానని గ్రహించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.