‘లక్ష్మీ’ (పార్వతీ) చుట్టూ రాజకీయం.. ?!

ఏపీ రాజకీయాలు లక్ష్మీ పార్వతీ చుట్టూ తిరుగుతున్నాయి. వినడానికి సిల్లీగా అనిపించినా ఈ మాట నిజం. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు మహానటుడు ‘ఎన్టీఆర్’ బయోపిక్ లు క్యూ కట్టబోతున్న విషయం తెలిసిందే. ఏకంగా మూడు బయోపిక్ లు రాబోతున్నాయి. ఈ మూడు కూడా రాజకీయ లబ్ధి కోసమే తీస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇవి పొలిటికల్ సపోర్టుతో తెరకెక్కుతుండటం విశేషం.

ముందుగా ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించబోతున్నట్టు ప్రముఖ నటుడు, ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రకటన చేశారు. ఈ బయోపిక్ లో ఎన్ టీఆర్ సినీ జీవితం, ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే వరకే చూపిస్తామని, ఎలాంటి వివాదాలకు చోటుండదని సంకేతాలు ఇచ్చారు. దీంతో.. ఇది చంద్రబాబు సూచనతో రెడీ అవుతున్న ఎన్నికల హస్త్రమని ప్రతిపక్ష పార్టీలు గ్రహించాయి.

ఆ వెంటనే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ పై ప్రకటన చేసేశారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ టైటిల్ తో ఎన్ టీఆర్ జీవితంలోని లక్ష్మీ పార్వతీ ఏపీసోడ్ ని సినిమాగా తీయబోతున్నట్టు తెలిపారు. ఈ బయోపిక్ కి నిర్మాతగా వైసీపీ నేత రాకేష్ రెడ్డి అని తెలయడంతో.. ఇది వైసీపీ ఎన్నికల ఎత్తుగడగా అర్థమయ్యింది. దీంతో.. ఈ బయోపిక్ ని టీడీపీ నేతలు వ్యతిరేకించడం మొదలెట్టారు. చివరకు అధినేత చంద్రబాబు సూచనలతో కాస్త తగ్గారు.

ఇంతలో దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నిద్రలేచారు. తాను ఎన్ టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ పేరిట సినిమాని సెట్స్ మీదకు కూడా తీసుకెళ్లారు. ఇతడు టీడీపీకి పరమభక్తుడు. ఈ బయోపిక్ లోను లక్ష్మీ పార్వతీని నెగటివ్ గా చూపించబోయే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది సమాచారమ్.

మొత్తానికి.. వచ్చే సాధారణ ఎన్నికల్లో లక్ష్మీ పార్వతీని ప్లస్సు, మైనస్సు చేసి లాభపడాలని ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్లాన్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మరీ.. లక్ష్మీ పార్వతీ ఎవ్వరికీ మేలు చేస్తుంది ? ఎవ్వరికీ చేటు చేస్తుంది అనేది వేచి చూడాలి.