ఆప్, టీఆరెస్ పొత్తుపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఏమన్నారంటే
మంత్రి కేటీఆర్ తో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శాసనసభ ప్రాంగణంలో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ -హబ్ బాగా పనిచేస్తోందని , ఇంక్యుబేటర్లు, అంకురాలను బాగా ప్రోత్సహిస్తున్నారని సిసోడియా ప్రశంసించారు. ఢిల్లీలో కూడా ఈ తరహా విధానాన్ని అమలు చేస్తామని, ఇందుకోసం తెలంగాణ సహకారం తీసుకుంటామన్నారు. కొత్త రాష్ట్రం తెలంగాణ బాగా అభివృద్ధి చెందుతోందని, మంచి విధానాల్లో పరస్పరం సహకరించకుంటామని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా అన్నారు.
నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ముందుందని చెప్పారు.హైదరాబాద్ వాతావరణం బాగుందని, దిల్లీలో ఆకాశాన్ని చూసే అవకాశం లేదని, కానీ హైదరాబాద్ లో ఆ అవకాశం కలిగిందన్నారు. రాజకీయాల్లో ఆప్, టీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేసే విషయాన్ని భవిష్యత్ నిర్ణయిస్తుందని చెప్పారు. దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.