టార్గెట్ పులివెందుల..
వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో ఎక్కువ చోట్ల గెలిచేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. అందులోనూ పులివెందులలో టీడీపీ జెండా ఎగరేయాలని ఆ పార్టీ తహతహలాడుతోంది. 1984 నుంచి ఇప్పటి వరకు అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. మూడు దశాబ్దాలకు పైగా అక్కడి ఓటర్లను టీడీపీ ప్రభావితం చేయలేకపోయింది. 2019లో పులివెందుల గెలుపును ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని అక్కడి నియోజకవర్గ నేతలకు చంద్రబాబు చెప్పేశారట. అక్కడ గెలవడం ద్వారా కడప పార్లమెంటు స్థానాన్ని దక్కించకోవచ్చని సీఎం భావిస్తున్నారు.
ఆ ప్రాంతానికి కృష్ణా జలాలు అందిచడమే కాకుండా, ఉద్యాన పంటలకు ఊతమిచ్చి రైతులకు ప్రోత్సాహించాలని జిల్లా నేతలకు సీఎం చంద్రబాబు చెప్పారు. అవసరమైతే కుప్పం కంటే ఎక్కువగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని సూచించారట. పులివెందుల అసెంబ్లీలో గెలిచి తీరాలన్న లక్ష్యంతో పనిచేయాలని, అక్కడ ఓటమి వల్లే కడప పార్లమెంటులో తెలుగుదేశం పార్టీకి నష్టం కలుగుతోందని ఆయన చెప్పారట. పార్టీ నేతలంతా సమైక్యంగా పనిచేసి ఆ దిశగా కృషి చేయాలని చంద్రబాబు పిలుపనిచ్చారట. ఇందుకోసం తనవైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని నేతలకు హామీ ఇచ్చారట.