హమీ ఇచ్చి ఉంటే రేవంత్ రెడ్డితోనే ఫ్లైట్ ఎక్కేదాన్ని !

టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యురాలు, ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు ఎలిమినేటి ఉమామాధ‌వ‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైఎస్ రాజ‌శేక‌ర్ రెడ్డి సీఎంగా ఇచ్చిన హామీ మేర‌కు నక్సల్ చేతిలో చనిపోయిన నేతలకు ఇచ్చే ఇంటి ప్లాట్’పై అసెంబ్లీలో సీఎం కేసీర్’కు వినతిపత్రం అందజేశారామె. ఒంట‌రిగా క‌లిస్తే పార్టీ మారుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతంద‌నే, సండ్ర‌వెంక‌ట వీర‌య్య‌తో క‌లిసి వెళ్లాన‌ని అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో క‌లిసిన వారితో ఆమె అన్నారు. అందుకే అంద‌రూ ఉండ‌గానే సీఎంను క‌లిసాన‌ని చెప్పారు.

గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేర‌తార‌నే జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ విష‌యాన్ని ప‌లువురు ప్ర‌స్తావించ‌గా ఎలాంటి హామీ లేకుండా కాంగ్రెస్ లో చేరేంద‌కు తానేమీ పిచ్చిదాన్ని కాద‌ని, తెలంగాణలో టీడీపీ పని అయిపోందన్నది అందరికీ తెలిసిన విషయమే అంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ కు పదవులపై హమీ ఇచ్చి ఉండవచ్చని, త‌న‌తో ఏమీ మాట్లాడకుండా ఎలా చేరతానని ప్ర‌శ్నించార‌ట‌.

హమీ ఇచ్చి ఉంటే రేవంత్ రెడ్డితోనే ఫ్లైట్ ఎక్కేదాన్నని, టీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరమని గత ఎన్నికల ముందు ఆహ్వానించారు. కానీ, అప్పుడు నేను పార్టీలో చేరలేదు. ప్రస్తుతం నన్న టీఆర్ఎస్ లోకి రమ్మని ఎవరూ అడగలేదని, పార్టీలో చేరమని అడిగితే అప్పుడు ఆలోచిస్తాన‌ని చెప్ప‌క‌నే చెప్పారు. ప్రస్తతం తానూ, త‌న‌ కుమారుడు త‌మ‌ రాజకీయ భవిష్యత్తుపై ఏ నిర్ణయం తీసుకోవాలా అని ఆలోచిస్తున్నామ‌ని, ఏ పార్టీలో చేరినా, త‌న కుమారుడి వెంట ఉంటాన‌ని అన్నారు.