అధికార‌పార్టీలో వేడెక్కిన రాజ‌కీయం.

తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయం వేడెక్కుతోంది.అందులోనూ అధికార పార్టీలో ఈ ప‌రిస్తితి మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా స‌మ‌య‌మున్నా.. ఇప్ప‌టి నుంచే ఆశావ‌హులు త‌మ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ప్ర‌తిప‌క్ష పార్టీలలో కొన్నిచోట్ల మిన‌హా దాదాపుగా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులు ఎవ‌ర‌నేది ఒక క్లారిటీ ఉంది. కానీ అధికార పార్టీలో మాత్రం ప‌రిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.

సిట్టింగు ఎమ్మెల్యేల‌తో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి టికెట్ వ‌స్తుందో అనే ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. ముఖ్య‌మంత్రి కేసీఆర్ సిట్టింగుల‌కు సీట్లు ప‌దిలం అని బాహాటంగా చెప్పిన‌ప్ప‌టికీ మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేఫ‌థ్యంలో ఎవ‌రి సీటు ప‌దిల‌మో అనే గుబులు ప‌ట్టుకుంద‌ట‌. ప‌నితీరు బాగున్న వారితో పాటు ప‌నితీరుపై త‌క్కువ మార్కులు వ‌చ్చిన వారు సీఎం దృష్టిలో ప‌డేందుకు తెగ ఆరాట‌ప‌డుతున్నార‌ట‌.

సంద‌ట్లో స‌డేమియా అన్న‌ట్టుగా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌స్తుత అధికారపార్టీ ఎమ్మెల్యే లొసుగు దొరికితే చాలు దాన్ని గోరంత‌ను కొండంత‌లు చేసి పార్టీ అధినేత దృష్టిలో మంచి మార్కులు కొట్టేయాల‌ని చూస్తున్నార‌ట కొంత‌మంది ఆశావ‌హులు. చీమ చిటుక్కుమ‌న్నా స‌రే ఆ విష‌యాన్ని సీఎం వ‌ర‌కు తీసుకెళ్లి స్వామి భ‌క్తిని ప్ర‌ద‌ర్శించుకుంటున్నార‌ట‌. ఎవ‌రిని క‌లిస్తే త‌మ‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు రావ‌డం గ్యారంటీ ఉంటుంద‌నే ఆలోచ‌న చేస్తూ ఆదిశ‌గా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టార‌ట‌.

ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తూ త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ పై లెక్క‌లు వేసుకుంటున్నార‌ట‌. అయినా వారి పిచ్చిగానీ రాత్రికిరాత్రి రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారిపోతున్న ఈ రోజుల్లో ఎవ‌రికి ఎవ‌రు గ్యారంటీ చెప్పండి. చూడాలి మ‌రి ఇందులో ఎవ‌రి ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయో.. ఎవ‌రికి ఆశాభంగం క‌లుగుతుందో..