ల‌క్ష్మీస్ భ‌యంలో వీర‌గ్రంథం యూనిట్..?

ల‌క్ష్మీపార్వ‌తి త‌న అనుమ‌తి లేనిదే సినిమా తీయ‌డానికి వీలు లేదంటూ రోడ్డెక్క‌డంతో ల‌క్ష్మీస్ వీర‌గ్రంధం సినిమా విషయంలో వివాదం మొద‌లైంది. ఎవ‌రి ద‌గ్గ‌ర అనుమ‌తి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదంటూ మొండిగా ముందుకెళ్లారు సినిమా ద‌ర్శ‌కుడు కేతిరెడ్డి. ఎన్టీఆర్ ఘాట్ లో సినిమా షూటింగ్ మొద‌లుపెట్టారు. నిమ్మ‌కూరులో కూడా సినిమా యూనిట్ కు చేదు అనుభ‌వం ఎదుర‌వ‌డంతో సందిగ్ధంలో ప‌డ్డారు యూనిట్ అంతా.

త‌మ‌కు బెదిరింపు కాల్స్ వ‌స్త‌న్నాయ‌ని, ర‌క్ష‌ణ కావాలంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌లిసి విన్న‌వించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ విష‌యాన్ని ఆలోచించి చెబుతాన‌ని సీఎం చెప్ప‌డంతో షూటింగ్ వాయిదా వేసుకున్నారు. క‌థ ఏపీలో ప్రారంభ‌మైనా ఎక్కువ భాగం హైద‌రాబాద్ లో జ‌రిగింది కాబ‌ట్టి ఎక్క‌డా అవాంత‌రాలు క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ఇందుకోసం సినిమా ద‌ర్శ‌కుడు కేతిరెడ్డి తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయినిని క‌లిసారు. త‌న‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, రక్షణ కల్పించాలని కోరాన‌ని ఆయ‌న చెప్పారు. రక్షణ కల్పించాలని ఏపీ డీజీపీని కూడా కోరాన‌ని, ఏపీ సీఎంను కలిస్తే..నా వెనుక చంద్రబాబు ఉన్నారని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. సీఎం కేసీఆర్‌ను కూడా కలవాలనుకుంటున్నానని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు.