ప్రత్యేక హోదాను అసెంబ్లీ ఇస్తుందా..?

విప‌క్ష నేత జ‌గ‌న్ పై మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి విరుచుకుప‌డ్డారు. ప్ర‌త్యేక హోదాపై వైసీపీ కార్యాచ‌ర‌ణను ప్ర‌క‌టించిన జ‌గ‌న్ పై ఆయ‌న ఘాటుగా స్పందించారు. అసెంబ్లీకి రాకుండా, విషయాలు తెలుసుకోకుండా జగన్ విమర్శలు చేస్తున్నారన్నారు పట్టిసీమకు.. రాయలసీమకు సంబంధమేంటని జగన్ ప్రశ్నించడం అవివేకానికి నిద‌ర్శ‌న‌మ‌ని విమ‌ర్శించారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెసిటీకి వంద టీఎంసీలు ఇవ్వడం వల్లే.. పోతిరెడ్డిపాడు నీటిని రాయలసీమకు మళ్లించగలిగామ‌ని ప్ర‌భుత్వ కృషిని ఆయ‌న గుర్తుచేశారు.

అవినీతి కేసుల్లో శుక్రవారం కోర్టుకెళ్తూ.. శనివారం ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేస్తే ప్రజలు నమ్ముతారా..? అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో ఛలో అసెంబ్లీ నిర్వహిస్తే లాభమేంటని, ప్రత్యేక హోదాను అసెంబ్లీ ఇస్తుందా..? అని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా విషయంలో తన ఎంపీలతో రాజీనామా చేయిస్తామంటే తామేమైనా వ‌ద్ద‌న‌లేద‌ని చెప్పారు.