భజ్జీని క్షమాపణ అడిగిన గంగూలీ
సారథి సౌరవ్ గంగూలీ సారథ్యంలో మెరిసిన వారిలో వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ ఒకరు. తన ఆఫ్‌స్పిన్ మాయాజాలంతో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. భారత్ తరఫున టెస్టుల్లో తొలి హ్యాట్రిక్ అందుకున్నాడు. జట్టు విజయాల్లో కీలకంగా నిలిచాడు. అందుకే దాదా, భజ్జీ ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఆ సానిహిత్యంతోనే భజ్జీ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటోపై దాదా స్పందించారు.
తన భార్య గీతా బస్రా, కుమార్తె హినయ హీర్ ప్లహాతో అమృత్‌సర్ స్వర్ణదేవాలయం ముందు దిగిన ఫోటో అది. ఈ ట్వీట్‌కు గంగూలీ స్పందించాడు. ‘బేటా బహూత్ సుందర్ హై భజ్జీ.. బహూత్ ప్యార్ దేనా’ అని ట్వీట్ చేశాడు. అయితే, హర్భజన్ కుమార్తెను కొడుకుగా అనుకొని బేటా అన్న పదం వాడాడు. వెంటనే తన పొరపాటు గ్రహించి క్షమాపణ చెప్పాడు దాదా. ‘హర్భజన్ సింగ్ క్షమించు. బేటీ చాలా బాగుంది. ముసలోడిని అయిపోతున్నా!’ అని చమత్కరిస్తూ.. మళ్లీ ట్వీట్ చేశాడు.
‘నా బిడ్డ పట్ల ప్రేమకు, ఆశీర్వాదానికీ ధన్యవాదాలు దాదా. త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నా’ అని భజ్జీ రిప్లే ఇచ్చాడు.