కేటీఆర్ పర్యటనలు అందుకేనట..
కొంతకాలం క్రితం వరకు జిల్లా పర్యటనలు చేసిన మంత్రి కేటీఆర్ తాజాగా హైదరాబాద్ లో గల్లీ గల్లీ తిరుగుతున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కలియదిరుగుతూ అధికారుల్లో హడల్ పుట్టిస్తున్నారు. ఎన్నికల హామీలు, ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరును చూస్తూ అధికారులకు , ప్రజాప్రతినిదులకు చురకలు వేస్తున్నారు.
ఇప్పటికే గ్రేటర్ కార్పోరేటర్ల విషయంలో నెగిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పర్యటన పార్టీకి లాభించేలా చూసుకుంటున్నారట. ఎన్నికల వ్యూహంతోనే ముందస్తుగా హైదరాబాద్ లో గల్లీ గల్లీ లో తిరుగుతున్నారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పార్టీ బలోపేతంలో భాగంగా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించారు. అయితే వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపొందేలా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించారని చెప్పుకుంటున్నారు.
ఎన్నికల హామీలు ఏమిచ్చాం, పనులు ఎంత వరకు జరిగాయో తెలుసుకుంటు ఆయన పర్యటన కొనసాగుతోందట. సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో అప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు కేటీఆర్. అందులో భాగంగానే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి నిదులు ప్రకటించారట. ఉద్యోగాల భర్తీ విషయంలోనూ తాము సీరియస్ గా ఉన్నామనే మార్కును ప్రజల్లోకి తీసుకెళుతూ ఎన్నికల స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నారట. చూడాలి మరి మంత్రి కేటీఆర్ వ్యూహం ఎంతమేరకు ఫలితాలనిస్తుందో..