బాంబు బెదిరింపు చేసిన వ్యక్తిని పట్టుకుని షాకైన పోలీసులు.. !!
అటు అమెరికా అధ్యక్షడి సలహాదారు ఇవాంకా, ఇటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సెక్యూరిటీలో తలమునకలైన పోలీసులకు సడన్ గా వచ్చిన కాల్ మరింత టెన్షన్ పడేలా చేసింది. ఫలక్ నూమా ప్యాలస్ లో విందు జరిగే సమయంలో అక్కడ బాంబు పెట్టామంటూ పోలీస్ కంట్రోల్ రూంకు వచ్చిన బెదిరింపు కాల్ తో తనిఖీలు ముమ్మరం చేశారు. ఆ సమయంలో ఆ కాల్ విషయం గురించి బయటకు రానివ్వడకుండా విందు సాఫీగా జరిగేలా చూశారు.
ఆ తరువాత ఆరా తీయడం మొదలుపెట్టిన పోలీసులు ఆ వ్యక్తి ఎవరో చేధించే పనిలో పడ్డారు. ఇంటర్నెట్ కాల్ ద్వారా ఈ బెదిరింపు కాల్ వచ్చిందని గుర్తించిన పోలీసులు అది ఎక్కడినుంచి ఎవరు చేశారో అని తెలుసుకునే పనిలో పడ్డారు. 24గంటల్లో ఆవ్యక్తి ఎవరో చేధించారు పోలీసులు.
ఆ కాల్ చేసిన వ్యక్తి మౌలాలికిచెందిన బొంత ఎల్లయ్య( 60 yr) గుర్తించారు పోలీసులు. అతనికి మతిస్థిమితం సరిగా లేదని, కొంతకాలంగా మానసిక సమస్యతో బాధపడుతున్నాడని తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. గతంలో మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో కుటుంబీకులు ఫిర్యాదు చేస్తే, అతన్ని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించారట. అక్కడ నుంచి బయటకు వచ్చాక ఇదిగో ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడట.