కొలువుల కొట్లాట‌కు సిద్ధం

టీజేఏసీ త‌ల‌పెట్టిన కొలువుల కొట్లాట స‌భకు ఎన్నో అవాంత‌రాలు ఎదురైనా కోర్టు తీర్పుతో ప్ర‌భుత్వం ఆ స‌భ‌కు అనుమ‌తి ఇవ్వ‌క త‌ప్ప‌లేదు. మ‌రి కొద్ది రోజుల్లో నిర్వ‌హించబోయే ఈ స‌భ‌ను గ్రాండ్ స‌క్సెస్ చేసేందుకు టీజీఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం రంగంలోకి దిగారు. ప్ర‌భుత్వం, పోలీసుల అవాంత‌రాల‌ను దాటుకుని స‌భ‌ను నిర్వ‌హించ‌డంలో వెన‌క్కి త‌గ్గ‌కుండా ముందుకు న‌డిచి నైతికంగా విజ‌యం సాధించినా , స‌భ ద్వారా తామేంటో చూపించాల‌ని టీజేఏసీ భావిస్తోంది.

ఇప్ప‌టికే స‌భకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసే ప‌నిలో ప‌డిన జేఏసీ స‌భ్యులు ఇటు నిరుద్యోగుల‌తో పాటు అటు పొలిటిక‌ల్ స‌పోర్ట్ కూడా ఉంటే బాగుంటుంద‌ని భావిస్తున్నారు. అందుకే కొలువుల‌కై కొట్లాట స‌భ‌కు మ‌ద్ద‌తు తెల‌పాల్సిందిగా కోర‌డానికి తానే స్వ‌యంగా రంగంలోకి దిగారు కోదండ‌రాం.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు లక్ష్మ‌ణ్, టీపీసీసీ అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని క‌లిసి స‌భ‌కు మ‌ద్ద‌తు కోరుతున్నారు. ఇత‌ర పార్టీలు, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తు కూడా కూడ‌గ‌ట్టుకుని స‌భ‌ను గ్రాండ్ స‌క్సెస్ చేసి ప్ర‌భుత్వం మెడ‌లు వంచాల‌ని టీజేఏసీ భావిస్తోంది.