రూటుమార్చిన రేవంత్…?

* పార్టీతో పాటు పొలిటిక‌ల్ స్టైల్ మార్చిన రేవంత్.
* అధికార పార్టీ హ‌డావుడి చేస్తున్నా నిబ్బ‌రంగా ఉన్న రేవంత్.
* ప‌క్కా క్లారిటీతో వ్యూహాత్మ‌కంగా ముందుకు.

పార్టీ మారిన త‌రువాత రేవంత్ రెడ్డిలో చాలామార్పు క‌నిపిస్తోంది. టీడీపీలో దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరిన త‌రువాత ఎందుకు సైలెంట్ అయ్యార‌నే ప్ర‌శ్న‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. స‌ముద్రంలో నీటి చుక్క‌లాగే కాంగ్రెస్ లో రేవంత్ అంటూ అధికార పార్టీ ఎద్దేవా చేసినా మౌనంగానే ఉంటూ త‌న‌ప‌ని తాను చేసుకుపోతున్నారు. ప్ర‌తీ విమ‌ర్శ‌కు స్పందించ‌డం కంటే ఎవ‌రు ఏమ‌నుకున్నా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్లాల‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అధికార‌పార్టీ హ‌ల్ చ‌ల్ చేస్తున్నా, చేరిక‌ల‌ను ప్రోత్స‌హిస్తూ ఉప ఎన్నిక‌లో విజ‌యంపై ధీమా వ్య‌క్తం చేసి రేవంత్ ప‌ని అయిపోయింది అని ప్ర‌చార చేస్తున్నా ఇవేవీ పట్ట‌న‌ట్టుగా కూల్ గా ఉంటున్నారు రేవంత్. గ‌తంలో దూకుడుగా వ్య‌వ‌హ‌రించి ఎదురైన అనుభ‌వాల నేప‌థ్యంలో ప‌రిణ‌తి చెందిన రాజ‌కీయ నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించాల‌ని రేవంత్ భావిస్తున్నారు. అందుకే వ్యూహాత్మ‌కంగా ముందస్తు ప్ర‌ణాళిక ప్ర‌కారం ముందుకు వెళుతున్నార‌ట‌. పార్టీతో పాటు త‌న పొలిటిక‌ల్ స్టైల్ ను మార్చుకుని ప‌క్క వ్యూహంతో ముందుకు వెళుతున్నారట‌.

పార్టీ మార‌డానికి ముందే త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితులను అంచాన వేసిన రేవంత్ ముందుగానే అవ‌న్నీచ‌క్క‌దిద్దుకున్నార‌ట‌. అదికార పార్టీ ఏం చేస్తుంద‌నేది ముందుగానే ఓ క్లారిటీకి వ‌చ్చిన ఆయ‌న అనుకున్న ప్ర‌కారం అంత‌ర్గ‌తంగా తాను చేయాల్సిందే చేసుకుంటూ వెళుతున్నార‌ట‌. అందుకే తొంద‌ర‌ప‌డి ఎలాంటి విమ‌ర్శ‌ల‌కు దిగ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నార‌ట‌. కొడంగ‌ల్ లో ఉప ఎన్నిక‌పై జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్నా ఇప్ప‌ట్లో ఉప ఎన్నిక వ‌చ్చే అవ‌కాశ‌మేలేద‌ని రేవంత్ అంచ‌నా వేస్తున్నారు. ఒక‌వేళ వ‌స్తే ఎలా ముందుకు వెళ్లాల‌నేదానిపై కూడా ఆయ‌నలో ఓ క్లారిటీ ఉంద‌ట‌.

ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌కే ప్రాధాన్యం ఇవ్వ‌కుండా అంద‌రినీ క‌లుపుకుని ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్ గెలుపుకు కావాల్సిన చ‌ర్య‌ల‌పై దృష్టి పెట్టార‌ట‌. పైకి క‌నిపించేలా అన్నీ ఆర్భాటంగా, హ‌డావుడి చేస్తూ చేయ‌క‌పోయినా ఓ క్లారిటీతో అంత‌ర్గ‌తంగా తాను చేయాల్సింది చేసుకు పోతున్నార‌ట‌. ఎప్పుడు క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించాలో అప్పుడే దూకుడు ప్ర‌ద‌ర్శించాలి త‌ప్ప .. అధికార పార్టీ ట్రాప్ లో ప‌డ‌కుండా తాను అనుకున్న రీతిలో ముందుకు వెళ్లాల‌ని భావిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఆయ‌నను యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్న యోధుడిగానే భావించాలి త‌ప్ప‌… రేవంత్ ప‌నైపోయింద‌న‌కుంటే అధికార పార్టీ నేత‌ల పొర‌పాటే అవుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. సో.. వెయిట్ అండ్ సీ అని రేవంత్ చెప్ప‌క‌నే చెబుతున్నార‌న్న‌మాట‌..