కొట్లాట ప్రభావం ఆ స్థాయిలో ఉంటుందా…?
నిరుద్యోగ సమస్యలే ప్రధాన ఎజెండాగా డిసెంబర్ 4న టీజేసీ తలపెట్టిన కొలువులకై కొట్లాట సభ తెలంగాణలో పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. న్యాయపరంగా కొలువుల కొట్లాట సభ అనుమతుల కోసం కూడా ప్రభుత్వంతో కొట్లాడినంత పనిచేసింది టీజేఏసీ. చివరకు అనుకున్నట్టుగానే సభను నిర్వహించి తీరుతోంది.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో నిరుద్యోగులను ఏకం చేసి సభకు కావాల్సిన ప్రచారమంతా చేశారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. పనిలో పనిగా అన్నిపార్టీల రాజకీయ మద్దతు కూడా కూడగట్టారు. దాదాపుగా ఉద్యమ సమయంలో తెలంగాణ జీవన్మరణ సమస్యగా ఎలా ఫీల్ అయ్యారో.. అదే స్థాయిలో ఈ సభకు హైప్ ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు కోదండరాం.
ప్రభుత్వ అనుకూల వర్గాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికి అవేవీ పట్టించుకోకుండా సభ విజయవంత చేసి ప్రభుత్వానికి ప్రజా బలాన్ని చూపాలనుకుంటోంది టీజేఏసీ. అందుకే దాదాపుగా తెలంగాణ ఉద్యమ సమయంలో మద్దతు తెలిపిన ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, నిరుద్యోగ యువత నుంచి పెద్ద ఎత్తున సభకు మద్దతు లభిస్తోంది.
అటు అధికారపక్షంతో పాటు, ఇటు విపక్షాలు, తెలంగాణ ప్రజల అందరి దృష్టి ఈ సభపైనే ఉంది. ఉద్యమ సమయంలో జేఏసీ సభల ప్రభావంలా ఇప్పుడు ఈ కొట్లాట సభ ప్రబావం ప్రభుత్వంపై పడుతుందనే అంచాన వేస్తున్నారు కొందరు. నిజంగా ఆ స్థాయిలో ప్రభావం చూపుతుందో లేదో చూడాలి మరి..!