విషాదం : శ‌శిక‌పూర్ ఇకలేరు

అలనాటి మేటి బాలీవుడ్ నటుడు, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత శశికపూర్(79) కన్నుమూశారు. ఆయన గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. నెలరోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నారు. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. శ‌శిక‌పూర్ మ‌ర‌ణంతో బాలీవుడ్’లో విషాధ‌చాయ‌లు అలుముకున్నాయి. ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేశారు.

పాతతరం కథానాయకుడు పృథ్వీరాజ్‌ కపూర్‌ మూడో కుమారుడే శశికపూర్‌. 1940లోనే బాల నటుడిగా కెరీర్ ప్రారంభించారు. బాలీవుడ్‌లో లవర్‌బాయ్‌గా పేరు తెచ్చుకున్న శశికపూర్‌ నటుడిగానే కాకుండా దర్శక, నిర్మాతగా వ్యవహరించారు. శశికపూర్ మొత్తం 116 చిత్రాల్లో నటించారు. వీటిలో 61 చిత్రాల్లో ఆయన హీరోగా నటించారు.

36 చౌరంగిలేన్ , కామ‌సూత్ర‌, క‌లియుగ్ , జునూన్ , ఉత్స‌వ్ చిత్రాలు శశికపూర్ కెరీర్’ని మ‌లుపుతిప్పాయి. ఆయ‌న చివ‌రి చిత్రం ‘సైడ్ స్ట్రీట్స్’ (1999). ఆయ‌న చిత్ర సీమ‌కు చేసిన సేవ‌ల‌కు గానూ ఆయ‌న‌కు 2011లో ప‌ద్మ‌భూష‌న్, 2015లో దాదాఫాల్కే అవార్డుల‌తో ప్ర‌భుత్వం స‌త్క‌రించింది.