దారుణం : తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలా జరగలేదు
ఉస్మానియా యూనివర్శిటీలో పోలీసుల ప్రవర్తన వివాదంగా మారింది. ఆత్మహత్య చేసుకున్న మురళి మృతదేహాన్ని తరలించేందుకు విద్యార్థులు అడ్డుకోవడంతో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. విద్యార్థి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన తరువాతే మృతదేహాన్ని తరలించాలని విద్యార్థులు పట్టుపట్టారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. విద్యార్థులు రాళ్లు విసరడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
మీడియా ఎవరినీ లోపలకి రానివ్వకుండా ఆంక్షలు విధించారు. విద్యార్థులను నిర్బంధించడంతో కవరేజీకి వెళ్లిన మీడియాను బంధించి, రిపోర్టర్, కెమెరామెన్’ను దారుణంగా కొట్టారు. అర్థరాత్రి దాటిన తరువాత జరిగిన ఈ దాష్టీకాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
ఘటనకు భాధ్యులైన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇంత దారుణంగా ప్రవర్తించలేదని, తెలంగాణ ప్రభుత్వంలోనే ఇలాంటివి జరగడం దారుణమనే విమర్శలు వస్తున్నాయి.