వివాహం తర్వాత మహిళ త‌న మ‌తాన్ని కోల్పోతుందా…?

మ‌తాంత‌ర‌ వివాహం చేసుకున్నప్ప‌టికీ మహిళ తన సొంత మతాన్ని కోల్పోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆమె మతవిశ్వాసాలు భర్త మతంలో కలిసిపోతాయని ఏ చట్టమూ చెప్పలేదని పేర్కొంది. హిందూ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న పార్సీ మహిళ.. వివాహ అనంతరం తన మతాన్ని కోల్పోతుందా? లేదా? అన్న వ్యాజ్యం గురువారం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. గూల్రోఖ్ ఎం.గుప్తా అనే పార్సీ మహిళ హిందూ వ్యక్తిని మతాంతర వివాహం చేసుకున్నారు. హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకున్న పార్సీ మహిళ తన మతాన్ని కోల్పోయి, భర్త మత విశ్వాసాలకు చెందిన వ్యక్తి అవుతుందని 2010లో గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

దీనిని సవాలుచేస్తూ గుప్తా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే గుప్తా తన తల్లిదండ్రులకు పార్సీ సాంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతించే విషయమై ‘వల్సద్ పార్సీ ట్రస్ట్’ తన అభిప్రాయం చెప్పాలని న్యాయస్థానం కోరింది. ఈ విష‌యంపై విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది సుప్రీం.