క్రిమినల్‌ ‘ప్రజా ప్రతినిధులకు షాక్’.. ?!

రాజకీయ నాయకులకి సుప్రీం కోర్టు షాకిచ్చింది. అలాగని అందరికీ కాదు. వివిధ కేసుల్లో ఇరుక్కొని దర్జాగా పదవులని అనుభవిస్తున్నవారికి మాత్రమే. దేశంలో క్రిమినల్ కేసులు కలిగిన రాజకీయ నాయకుల లిస్టు చాలా పెద్దదే. ఇప్పుడు వీరిపై కొరఢా రులిపించింది సుప్రీం. మార్చి నుంచి ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణ ప్రారంభం కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇందుకోసం 12రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటుకు రూ.7.8కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రం కేటాయించిన నిధులను హైకోర్టుల సూచన మేరకు రాష్ట్రాలు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని తెలిపింది. రెండు నెలల్లో ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసుల వివరాల నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే అమలైతే.. వచ్చే సాధారణ ఎన్నికల్లో క్రిమినల్ ప్రజా ప్రతినిధులకు ఓటు వేసే ద్రౌభాగ్యం నుంచి ప్రజలు తప్పించుకొన్నట్టే.. !