గెలుపెవరిది…??
గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నుంచి బీజేపీ, కాంగ్రెస్ లు పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. నువ్వా, నేనా అన్నట్లుగా ఒకరిపై ఒకరు యుద్ధవాతావరణం స్పురించేలా ఆరోపణలు చేసుకున్నారు. అయితే ఇన్నాళ్ల ఉత్కంఠకు ఇక తెర పడనుంది. మరి కొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
అటు అధికార బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీకి రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇవొక గీటురాయిగా మారనున్నాయి. అందుకే ఈ ఎన్నికలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. రెండు రాష్ట్రలలో ఎగ్జిట్ పోల్స్ అధికార బీజేపీకే మొగ్గు చూపినా అసలు ఫలితాలు వచ్చే వరకు గెలుపెవరిదనేదానిపై స్పష్టత వచ్చేలా కనిపించడంలేదు.
ఫలితాలకుముందే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పట్టాభిషక్తుడైన రాహుల్ భవితవ్యంపై ఈ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తే ఆ క్రెడిట్ అంతా రాహుల్ కే దక్కుతుంది. బీజేపీ గెలిచినా రాహుల్ సారథ్యంలో టీం సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత వేగం పుంజుకునేందుకు ప్రయత్నిస్తుంది. మొత్త మీద మరి కొద్ది గంటల్లో గెలుపెవరిదో.. ఎవరి సత్తా ఏమిటో తేలనుంది.