ఒకే కుటుంబంలో ఏడుగురి అనుమానాస్ప‌ద మృతి..!

ఆర్థిక ప‌రిస్థితులో.. ఇంటిపెద్ద దిక్కు అనారోగ్యం బాధ‌లోగానీ.. ఆకుటుంబం మొత్తాన్ని మృత్యు ఒడిలోకి నెట్టాయి.. తామే క‌లుపుకున్నారో.. ఇంకెవ‌రైనా క‌లిపారో తెలియ‌దు కానీ.. ఆ భోజ‌న‌మే వారికి చివ‌రి భోజ‌న‌మైంది.. ఆ రాత్రే వారి జీవితాల‌ను చీక‌టిమ‌యం చేసింది.. ఏం జ‌రిగిందో.. ఎలా జ‌రిగిందో ఎవ్వ‌రికీ తెలియ‌దు.. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఒచే ఇంట్లో ఏడుగురు అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెంద‌డం జిల్లాలో క‌ల‌క‌లం రేపుతోంది..

వేసిన త‌లుపులు వేసిన‌ట్టే ఉన్నాయి.. నిద్ర‌లోకి వెళ్లిన ఆ కుటుంబం శాశ్వ‌త నిద్ర‌లోకి వెళ్లిపోయింది.. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా రాజ‌పేట మండ‌ల కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెంద‌డం స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది.

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా జ‌గ‌దేవ్ పూర్ మండ‌లం మునిప‌డ‌గ‌కు చెందిన బాల‌రాజు , తిరుమ‌ల దంప‌తులు నెల రోజుల క్రితం యాదాద్రిభువ‌న‌గిరి జిల్లా రాజ‌పేట మండ‌ల కేంద్రంలో ఉన్న ఓ కోళ్ల ఫాం లో ప‌నికి కుదిరారు. పిల్ల‌ల‌తో పాటు కోళ్ల‌ఫాం వ‌ద్దే ఉన్న చిన్న ఇంటిలో నివాస‌ముండేవారు. మూడు రోజుల క్రితం కూత‌రు , అల్లుడిని చూడ‌టానికి బాల‌రాజు అత్తా , మామ బైండ్ల బాల్ న‌ర్స‌య్య, భార‌త‌మ్మ‌లు వ‌చ్చారు. ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ.. శుక్ర‌వారం తెల్ల‌వారే స‌రికి ఏడుగురు విగ‌త జీవులుగా మారిపోయారు.

ఆహారంలో విషం క‌ల‌వ‌డం వ‌ల్లే ఏడుగురు మ‌ర‌ణించార‌ని పోలీసులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. క్లూజ్ టీం , డాగ్ స్క్వాడ్ వ‌చ్చి సంఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించింది. మొద‌ట‌గా ఆ కుటుంబాన్ని ఎవ‌రైనా చంపారా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేశారు. అయితే సంఘ‌ట‌నా స్థ‌లంలో ల‌భించిన ఆధారాలను ప‌రిశీలించిన పోలీసులు ఆహారంలో విష‌ప‌దార్థం క‌ల‌వ‌డం వ‌ల్లే చ‌నిపోయార‌ని ప్రాథమికంగా నిర్దార‌ణ‌కు వ‌చ్చారు.