మంత్రి తుమ్మలపై దాడికి యత్నం… ! 24మంది రిమాండ్…!!
ఎవరైనా సరే మంత్రుల్ని టార్గెట్ చేశారంటే అంతే సంగతి. అలాంటి వారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిందే. ఊచలు లెక్కెట్టాల్సిందే. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా సరే సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు పోలీసులు.. తాజాగా సూర్యపేట జిల్లాలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
మందకృష్ణ అరెస్టును నిరసిస్తూ శుక్రవారం సూర్యపేటలో పెద్ద రచ్చే జరిగింది. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు. మందకృష్ణను వెంటనే విడుదల చేసే వరకు కదిలేది లేదంటూ బీష్మించుకు కూర్చున్నారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైపోయింది.
అటుగా వెళుతున్న మంత్రి తుమ్మలకు అక్కడ తిప్పలు తప్పలేదు. ఆయన్ను అడ్డుకుని దాడి చేసినంత పని చేశారట ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు. మంత్రిని కదలనిచ్చేదిలేదని రోడ్డుకు అడ్డంగా నిలవడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చిందట. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి మంత్రిని అక్కడి నుంచి పంపించేశారు. అయితే శుక్రవారం జాతీయ రహదారి పై ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రాస్తారోకో చేస్తుండగా ట్రాఫిక్ లో చిక్కుకున్న మంత్రి తుమ్మల పై దాడికి యత్నించిన 24 మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను ఈ రోజు పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు.వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్ట్ . రిమాండ్ లో ఉన్నవారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.