ప్రధాని చెప్పిన ఆధునికవాది కథ.. !!
ప్రధాని మోదీ తన యూపీ పర్యటనలో ఆధునికవాదంపై ఓ పెద్దకథే చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా నోయిడాకు కొత్త మెట్రోరైలు ను ఆయన ప్రారంభించారు. మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగించిన సందర్భంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రశంసల వర్షం కురిపించారు. పనిలో పనిగా నోయిడాపై ఉన్న మూఢనమ్మకంపై ఓ కథ చెప్పారు ప్రధాని మోదీ.
గతంలో ఉన్న యూపీ ముఖ్యమంత్రులు ఎవరూ నోయిడాను పట్టించుకోలేదంటూ చురకలు వేశారు. అందుకు కారణం వాళ్లు మూఢనమ్మకాలను గట్టిగా నమ్మడమేనంటూ చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుత సీఎం యోగీ అలాంటి నమ్మకాలకు కాకుండా ఆధునికవాదానికి విలువనిస్తున్నారన్నారు ప్రధాని.
నోయిడాకు శాపగ్రస్త నగరం అని పేరుందని, ముఖ్యమంత్రిగా ఉన్నవారు ఆ నగరంలో అడుగుపెడితే తర్వాత ఎన్నికల్లో గెలుపొందరన్నది అక్కడ ప్రచారంలో ఉంది. దీంతో కొన్నేళ్లుగా ముఖ్యమంత్రులుగా ఉన్నవారు అక్కడ అడుగుపెట్టే సాహసం చేయడం లేదు. కానీ యోగీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారంటూ అభినందించారు ప్రధాని. యోగీ ఆధునికవాది కాదు అని మాట్లాడుకునేవారందరికీ ఈ సంఘటనే కనువిప్పు కావాలని ప్రధాని అభిప్రాయపడ్డారు.
మూఢనమ్మకాలతో కొందరు నాయకులు కొన్ని ప్రాంతాల్లో అడుగే పెట్టకపోవడం దురదృష్టకరమని ప్రధాని వ్యాఖ్యానించారు. అలాంటివి నమ్మి ఆ ప్రాంతానికి దూరంగా ఉండేవాళ్లు అసలు ముఖ్యమంత్రి పదవికే అనర్హులని మోడీ విమర్శించారు. మొత్తంగా ఇదీ ప్రధాని మోదీ చెప్పిన ఆధునివవాది కథ.