బీసీలకు ఉప ప్రధాని పదవి ఇవ్వాలి..! : నటుడు సుమన్
బీసీలకు ఉప ప్రధాని పదవి ఇవ్వాలంటూ సినీనటుడు వేదికపై డిమాండ్ చేశారు. ఉత్తర, దక్షిణ భేదం పోవాలంటే ఆ పని చేయక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతకీ ఇదేదో సినిమా కోసం వేదికపై నటుడు సుమన్ చెప్పిన డైలాగ్ కాదు. హైదరాబాద్ లో జరిగిన బీసీ విద్యార్థి గర్జన సభకు ఆయన అతిధిగా హాజరయ్యారు.
బీసీ విద్యార్థులను కలుసుకోవాలనే ఈసభకు వచ్చానని, తెలంగాణ గడ్డపై మెదటసారి బీసీ సభలో పాల్గొన్నానని సుమన్ అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు కోసం ఎంపీలు కృషి చేయాలని ఆయన అన్నారు. దక్షిణ, ఉత్తర భారతదేశ భేదం పోవాలంటే బీసీలకు ఉప ప్రధానమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని, చదువే మన ఆయుధం. బీసీలు బాగా చదువుకోవాలన్నారు. కేసీఆర్ తలచుకుంటే తెలంగాణలో బీసీలకు న్యాయం జరుగుతుందని, ముస్లింను ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు సుమన్. సినిమా పరిశ్రమతో సంబంధం లేకుండా బీసీల అభివృద్ధి కోసం నా ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.