అది చ‌ట్ట‌విరుద్ధం : టీజేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసం త‌న కార్యాల‌యంలో ఉప‌వాస దీక్ష చేస్తున్న మంద‌కృష్ణ మాదిగ‌ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వ వైఖ‌రిని విప‌క్షాలు, ప్ర‌జాసంఘాలు త‌ప్పుబ‌డుతున్నాయి. మంద కృష్ణ మాదిగ అరెస్టును ఖండిస్తున్నామ‌ని, బేషరతుగా విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తున్నామ‌ని టీజేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం తెలిపారు.

మందకృష్ణ మాదిగ అరెస్ట్ నగరంలో నెలకొన్న నిరంకుశ వాతావరణాన్ని అద్దంపట్టి చూపుతున్నదన్నారాయ‌న‌. ధర్నా చౌక్ మూసివేసినప్పటి నుండి హైదరాబాద్ నగరంలో నిరసనకు అవకాశం లేకుండా పోయిందని, ఎవ్వరికి కూడా ధర్నాలకు,నిరహార దీక్షలకు, నిరసన సభలకు వేదికనే లేదని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తమ డిమాండ్ల సాధనకై మందకృష్ణ మాదిగ అనుమతిని కోరుతూ డి.జి.పి ని,నగర కమిషనరును కలిసినా ఫలితం దక్కలేదన్నారు. వాస్తవానికి ప్రైవేటు స్థలంలో నిరసన తెలపడానికి అనుమతి అవసరం లేదని, కానీ ప్రభుత్వం కార్యాలయం నుండి అరెస్టు చేయడం అన్యాయం, చట్ట విరుద్ధమ‌ని ఆయ‌న అన్నారు.