ఆయ‌న మున్నాభాయ్ కాదు…!

తెలంగాణ వైద్య‌,ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ ల‌క్ష్మారెడ్డి చ‌దువుపై రాజ‌కీయంగా ప‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చాలా సంద‌ర్భాల్లో మున్నాభాయ్ అంటూ మంత్రిని విమ‌ర్శించారు కూడా. అస‌లు మంత్రి లక్ష్మారెడ్డి డాక్ట‌రే కాదంటూ చెప్పుకొచ్చారు. ఈ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్యా మాట‌ల యుద్దం కొన‌సాగుతూ వ‌స్తోంది. తాజాగా ఆయ‌న చదువుపై క్లారిటీ ఇచ్చింది హైద‌రాబాద్ క‌ర్ణాట‌క ఎడ్యుకేష‌న‌ల్ సొసైటీ హోమియోప‌తిక్ మెడిక‌ల్ కాలేజీ. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ సంప‌త్ రావు , పూర్వ విద్యార్థులు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చారు.

మంత్రి ల‌క్ష్మారెడ్డి వ్యక్తి మీద ఈ మధ్య కాలంలో కొందరు అసత్య ఆరోపణలకు దిగుతున్నారని, అవమానించే ప్రయత్నం చేస్తున్నారని ప్రిన్సిపాల్ సంప‌త్ రావు అన్నారు. విష‌యం తెలిసి వాస్తవాలను ప్రజలకు తెలపాలనే ఉద్దేశ్యంతో మేం మీడియా ముందుకు వచ్చామ‌న్నారు. డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి గారు 1980-81లో స్థాపించిన త‌మ కాలేజీ హైదరాబాద్ కర్ణాటక ఎండ్యుకేషనల్ సొసైటీ (HKES) హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో1987లో ఉత్తీర్ణులయ్యారని తెలిపారాయ‌న‌. లక్ష్మారెడ్డిగారు మొదటి బ్యాచ్ విద్యార్థి అని, ఆతర్వాత కర్ణాటక హోమియోపతిక్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆయ‌న అన్నారు.

త‌మ కాలేజీని 1985లోనే భారత ప్రభుత్వం గుర్తించి సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతిక్ 2వ చాప్టర్లో చేర్చి నోటిఫై కూడా చేసిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం త‌మ కాలేజీ పూర్వ‌విద్యార్థి మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి పై చేసిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నామ‌న్నారు. ఇంతటితో ఈ ఇష్యూని ముగించాలని విజ్ఞ‌ప్తి చేశారు. తదుపరి కూడా ఇలాంటివి కొనసాగితే తప్పకుండా చట్ట రీత్యా చర్యలకు దిగుతామ‌ని హెచ్చ‌రించారు.