దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు అందుకేనా..!
దుర్గగుడి వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. గర్భగుడిలో శుద్ధి పేరుతో మహిషాసురమర్దిని అలంకరణ చేసి పూజలు చేసినట్టు పోలీసు విచారణలో నిందితులు అంగీకరించడంతో ఈ ఘటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. . డిసెంబరు 26వ తేదీన సాధారణ రోజులకు భిన్నంగా ఆలయంలో వ్యవహరించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రోజు అర్ధరాత్రి శాంతిస్వరూపినిగా ఉన్న అమ్మవారిని మహిషాసురమర్ధినిగా అలంకరించి..భైరవీ పూజలు నిర్వహించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
భైరవీ పూజలు వల్ల శక్తులు సిద్ధిస్తాయనే నమ్మకముంది. పూజల అనంతరం అమ్మవారిని మళ్లీ దుర్గామాతగా అలంకరించినట్టు సమాచారం. ఆ సమయంలో గర్భగుడిలో ప్రధాన అర్చకుడు బద్రీనాథ్ బాబుతో పాటు మరో నలుగురు ఉన్నారు. రిజిస్టర్ లో మాత్రం రాత్రి 10.15 తరువాత ఎలాంటి ప్రవేశాలు నమోదుకాలేదు. నిజానికి అంతరాలయంలో రాత్రిపుట్ట శుద్ది కార్యక్రమం దేవాలయ చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడైనా పగటిపూట సుప్రభాత సేవకు ముందు శుద్ధిచేస్తారని, తర్వాత హారతి ఇస్తారని పురోహితులు చెబుతున్నారు. అలాగే అమ్మవారి అలంకరణ ప్రతి గురువారం మారుస్తారు. కానీ మంగళవారం రాత్రి ఇలా జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా…ఈవో సూచనల మేరకే తాము అర్ధరాత్రి పూజలు చేశామని వారు చెప్పారు. ఈ వివాదం నేపథ్యంలో ఆలయ ఈవో సూర్యకుమారిపై వేటుపడింది.
ఇందులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది అనేదానిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ముందు ముందు ఇంకెలాంటి ఈ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి..