హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఊహించని పరిణామం..!
హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్.సీ.ఏ)లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. హెచ్‌సీఏ కార్యదర్శి శేష్‌నారాయణను హెచ్.సీ.ఏ. సస్పెండ్ చేసింది. హైదరాబాద్ క్రికెట్ టీమ్స్ సెలెక్షన్ ప్రక్రియలో అక్రమాలు, ఎపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేశాడని ఆరోపణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శేష నారాయణకు సంబంధించి అన్ని ఆధారాలు అంబుడ్స్‌మన్‌కు సమర్పించింది.
సెలెక్షన్ కమిటీ నిర్ణయాల్లో కార్యదర్శి జోక్యాన్ని నిరసిస్తూ వరుసగా సీనియర్ సెలెక్టర్లు రాజీనామా చేశారు. ఆటగాళ్ళ ఎంపికపై జూనియర్ జట్టు కోచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత నెల 14న జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో శేషనారాయణకు నోటీసులిచ్చామని, పూర్తి ఆధారాలతో నివేదికను హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ నర్సింహారెడ్డికి అందజేశామని తెలిపారు హెచ్.సీ.ఏ ప్రెసిడెంట్ వివేక్.
జస్టిస్ లోధా కమిటీ సూచనల ప్రకారం శేష్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ నిర్వహిస్తామన్నారాయన. అంబుడ్స్‌మన్ ఆరు నెలలలోపు తన అభిప్రాయాన్ని హెచ్‌సీఏ ఎపెక్స్ కౌన్సిల్‌కు చెప్పొచ్చన్నారు. అప్పటి వరకు శేషనారాయణపై సస్పెన్షన్ కొనసాగుతోందని చెప్పారు. అంబుడ్స్‌మన్ నివేదిక వచ్చే వరకు ఎపెక్స్ కౌన్సిల్‌లో ఎవరో ఒకరు తాత్కాలిక కార్యదర్శిగా వ్యవహరించవచ్చని ఆయన స్పష్టం చేశారు.