టీపీసీసీపై క్లారిటీ ఇచ్చిన రాహుల్..!
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షపదవి చేపట్టిన తరువాత పీసీసీలో కీలక మార్పులుంటాయని భావించిన సీనియర్ కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవమే మిగిలింది. తమకు పీసీసీ పదవి వస్తుందని గంపెడాశలతో ఎదురు చూస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశలపై ఏఐసీసీ నీళ్లు చల్లింది. తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు మారతాడా, లేడా అనే డైలామాలో ఉన్న కాంగ్రెస్ నేతలకు ఎట్టకేలకు ఏఐసీసీ క్లారిటీ ఇచ్చింది.
అన్నిరాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కమిటీలు కొనసాగించాలని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించారు. ఈ మేరకు ఏఐసీసీ మీడియాకు ప్రకటన విడుదల చేసింది. గత కొద్ది రోజులుగా పీసీసీ పదవిలో ఉన్న నేతను మార్చాలని రెండు గ్రూపులుగా విడిపోయి పెద్ద హడావుడి చేస్తున్న నేతలకు రాహుల్ పెద్ద షాక్ ఇచ్చారు. ఇందులో ఎటువంటి మార్పుల్లేవని ఏఐసీసీ స్పష్టం చేసింది. తెలుగురాష్ట్రల పీసీసీ అధ్యక్షులకు నిజంగా ఇది శుభవార్తే అని చెప్పుకోవచ్చు.