లాలూకు మూడున్న‌రేళ్ల జైలు..

పశుదాణా కేసులో ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా తేలుస్తూ రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు శిక్ష ఖరారు చేసింది. లాలూకు మూడేన్నరేళ్లు జైలు శిక్ష విధించ‌డంతో పాటు ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా విధిస్తూ తీర్పుచెప్పింది. లాలూతో పాటు కేసులో దోషులుగా నిర్ధారించిన ఫూల్ చంద్, మహేష్ ప్రసాద్, బకె జులియస్, సునీల్ కుమార్, సుశీల్ కుమార్, సుధీర్ కుమార్, రాజారాంలకు కూడా కోర్టు మూడున్నరేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్క‌రికి 5 లక్షల రూపాయ‌ల జరిమానాను విధించింది.

అనారోగ్యం, వయోభారం కారణంగా శిక్షలు తగ్గించాలనంటూ లాలూ ప్రసాద్ కోర్టుకు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేసుకున్నార‌ట‌. దాణా కుంభకోణం వెలుగుచూసినప్పటి నుంచి లాలూ ఇంత‌వ‌ర‌కు 375 రోజులు జైలులో గడిపారు. తాజాగా లాలూకు మూడున్న‌రేళ్లు జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేయనున్నట్టు లాలూ తరఫు న్యాయవాది తెలిపారు.