రివ్యూ : అజ్ఝాతవాసి

చిత్రం : అజ్ఝాతవాసి (2018)
నటీనటులు : పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్
సంగీతం : అనిరుధ్
దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత : రాథాకృష్ణ
రిలీజ్ డేటు : 10 జనవరి, 2018.
రేటింగ్ : 3.5/5

అజ్ఝాతవాసి.. ఆకట్టుకొన్నాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే.. అంచనాలు ఓ రేంజ్’లో ఉండటం సహజం. ఈసారి ఆయన త్రివిక్రమ్’తో కలిసి వస్తున్నాడు. ‘అజ్ఝాతవాసి’గా వస్తున్నాడు. ఊహించినట్టుగానే అంచనాలు ఆకాశన్నంటాయి. కొద్దిరోజులుగా ఎక్కడ, ఏ నోట విన్న ‘అజ్ఝాతవాసి’ మాట వినబడుతోంది. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ‘అజ్ఝాతవాసి’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. యుఎస్, ఏపీలోనూ ‘అజ్ఝాతవాసి’లో ప్రీమియర్ షోలు పడిపోయాయి. మరీ.. ‘అజ్ఝాతవాసి’ ఎలా ఉన్నాడు ? ఏ మేరకు ప్రేక్షకులని మెప్పించగలిగాడు తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :
గోవింద భార్గవ్‌ అలియాస్ విందా (బొమన్‌ ఇరానీ)ని ప్రముఖ వ్యాపారవేత్త, ఏబీ గ్రూప్‌ అధినేత. ఆయన భార్య ఇంద్రాణి (కుష్బు). విందా, అతని కొడుకొని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేస్తారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కంపెనీ వ్యవహారాలు చూసుకునేందుకు ఓ యువకుడి ‘బాల సుబ్రహ్మణ్యం’ (పవన్‌ కల్యాణ్‌) అస్సాం నుంచి పిలిపిస్తుంది ఇంద్రాణి. అతడు ఏబీ గ్రూప్‌లో పర్సనల్‌ మేనేజర్‌గా చేరతాడు. ఓ వైపు, కంపెనీ వ్యవహారాలు చూసుకుంటూ మరోవైపు, విందా హత్యలకు కారకులైన వారి కనిపెడతాడు. ఇంతకీ ఆ హత్యలు ఎలా జరిగాయి ? ఎవరు చేశారు ? కథలో ఆదిపినిశెట్టి ఎవరు ? అన్నది త్రివిక్రమ్ మార్క్ తో కూడిన మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :
* పవన్‌ కళ్యాణ్ నటన
* కామెడీ
* ఇంటర్వెల్ ముందు ట్విస్ట్
* కొడకా కోటేశ్వరరావు పాట

మైనస్ పాయింట్స్ :
* అత్తారింటికి దారేది సినిమా చాయలు కనబడటం

ఎలా ఉంది ? ఎవరెలా చేశారు ?
వినడానికి ఓ క్రైమ్ కథలా ఉన్నా.. తెరపై త్రివిక్రమ్ మార్క్ సినిమా ఆహ్లాదం కనబడుతోంది. సినిమా ఫస్టాఫ్’ని కాస్త నెమ్మదిగా నడిపించి ఇంటర్వెల్ వరకు రక్తికట్టించేశాడు దర్శకుడు. కథలో మార్క్ హాస్యం ఆకట్టుకుంటోంది. ఫస్టాఫ్’లో నిందితులని కనిపెట్టిన సుబ్రమణ్యం.. సెకాంఢాప్ లో వారిపై ఎలా పగతీర్చుకొన్నాడు ? అందుకు ఏం చేశాడు అన్నది చూపించారు.

పవన్ – త్రివిక్రమ్ కలిస్తే ఏం చేయగలరు ? అన్నది ‘అజ్ఝాతవాసి’తో మరోసారి రుజువు చేశారు. త్రివిక్రమ్ మాటకు పవన్ నోట బుల్లెట్ గా మారింది. ఆ మాటల బుల్లెట్స్ ప్రేక్షకుల గుండెల్లో గుచ్చుకుపోతున్నాయి. త్రివిక్రమ్ పురాణ, ఇతిహాసాల్లోని అంశాలను నేపథ్యంగా తీసుకున్నాడు. ‘నకుల ధర్మం’ ప్రస్తావన చేశాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో అదరగొట్టాడు. ఇక, పవన్ అద్భుతమైన నటనతో వన్ మేన్ షో చేశాడు. పవన్ ఎంట్రీ, ఆయన పాడిన పాటకు థియేటర్స్ లో చపట్లే చప్పట్లు పడ్డాయి. మొత్తంగా పవన్ ఫ్యాన్స్’కు విందుభోజనం పెట్టేశారు.

పవన్ తర్వాత ఆదిపినిశెట్టి, కుష్భూల నటన ఆకట్టుకొనేలా ఉంది. హీరోయిన్స్ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లకు నటించే స్కోప్ పెద్దగా లేదు. ఐతే, తెరపై అందంగా కనిపించి ఆకట్టుకొన్నారు. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు. ప్రతి పాత్రపై కూడా త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనబడింది.

సాంకేతికంగా :
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాల్లో తనలోని దర్శకుడి కన్నా రచయితకు ఎక్కువ మార్కులు పడుతుంటాయి. ‘అజ్ఝాతవాసి’లోనూ రచయితదే డ్యామినేషన్ కనిపించింది. ఐతే, ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ని అదిరిపోయే రేంజ్’లో చూపించాడు. బల్గేరియాలో ఛేజింగ్‌ సీన్స్ బాగున్నాయి. సంగీత దర్శకుడు అనిరుధ్’కు తెలుగులో ఇదే తొలి సినిమా. ఆయన అందించిన పాటల్లో కొత్తదనం కనిపించింది. నేపథ్య సంగీతం ఆకట్టుకొనే ఉంది. వి.మణికందన్‌ కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 3.5/5

బాటమ్ లైన్ : అజ్ఝాతవాసి.. ఆకట్టుకొన్నాడు