రివ్యూ : జై సింహా
చిత్రం : జై సింహా (2018)
నటీనటులు : బాలకృష్ణ, నయనతార, నటాషా దోషి, హరిప్రియ
సంగీతం : చిరంతన్ భట్
దర్శకత్వం : కె.ఎస్. రవి కుమార్
నిర్మాత : సి.కల్యాణ్
రిలీజ్ డేటు : 12 జనవరి, 2018
రేటింగ్ : 2.5/5
ప్రతి యేడాది సంక్రాంతికి సందడి చేస్తూ సంక్రాంతి సింహంగా పిలిపించుకొంటున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. గత యేడాది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో గర్జించాడు. చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాడు. ఈ సంక్రాంతికి ‘జై సింహా’ రెడీ అయ్యాడు. సీనియర్ దర్శకుడు కె.యస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. నయనతారా, నటాషా దోషి, హరిప్రియ హీరోయిన్లు. ఇప్పటికే విడుదలయిన టీజర్, ట్రైలర్స్ ‘జై సింహా’ అంచనాలని పెంచేశాయి.
భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు ‘జై సింహా’. జై ‘సింహా గర్జన’ ఏ రేంజ్ లో ఉంది. అది ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది. ఇంతకీ జై సింహా కథేంటీ ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
విశాఖకు చెందిన నరసింహం (బాలకృష్ణ) యేడాది కొడుకుని తీసుకొని బతుకుదెరువు కోసం తమిళనాడులోని కుంభకోణం చేరుకుంటాడు. అక్కడ ఆలయ ధర్మకర్త మురళీ కృష్ణ (మురళీ మోహన్) ఇంట్లో డ్రైవర్’గా చేరుతాడు. లోకల్ రౌడీ కనియప్పన్ (కాళకేయ ప్రభాకర్) తమ్ముడికి మురళీ కృష్ణ కూతురు చేసిన యాక్సిడెంటులో.. నేరాన్ని తనమీద వేసుకొని కనియప్పన్ చేతిలో దెబ్బలో తింటాడు నరసింహం. ఈ క్రమంలో కొత్త ఏసీపీ, రౌడీ కనియప్పన్ గ్యాంగ్ కు టార్గెట్ గా మారతాడు నరసింహం.
నరసింహం కొడుకొని రౌడీ కనియప్పన్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తోంది. కొడుకొని కాపాడుకొనేందుకు నరసింహం రంగంలోకి దిగుతాడు. అదే సమయంలో గౌరి (నయనతార) తన కొడుకుని వెతుక్కుంటూ కుంభకోణం వస్తుంది. ఇంతకీ నరసింహం, గౌరిలకు మధ్య సంబంధం ఏంటీ ? ఏసీపీతో నరసింహం గొడవ ఏ మలుపు తిరిగింది ?? కథలో మిగితా ఇద్దరు హీరోయిన్స్ నటాషా దోషి, హరిప్రియ పాత్రలు ఏంటీ ? అనేది మిగితా కథ.
ఎవరెలా చేశారు ?
టాలీవుడ్ స్టార్ హీరోల్లో బాలకృష్ణకు ఓ ప్రత్యేక ఉంది. ఆయన కథ ఓకే చేశాడంటే.. దర్శకుడి పనిలో అస్సలు వేలు పెట్టడు. దర్శకుడు చెప్పినట్టు తూ.చ తప్పకుండా చేస్తాడు. ఇది బాలయ్య గొప్పదనం. ఈ విషయాన్ని ‘జై సింహా’ ఆడియో వేడుక వేదికపై దర్శకుడు కె.యస్ రవికుమార్ కూడా గొప్పగా చెప్పాడు. అలాంటి స్టార్ హీరో ఓ కథని ఓకే చేశాడంతే.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మరీ.. సినిమా తీయాల్సి ఉంటుంది. బాలయ్య మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని రాసుకొన్న కథ.. ఆయన అభిమానులని అలరించేలా ఉండాలి. కానీ, కె.యస్ రవికుమార్ ఏం చేశాడు ? సాధారణ కథని రాసుకొన్నాడు. దాన్ని ఇంకా సాధారణంగా తెరపై చూపించాడు. ఫలింతంగా గర్జించాల్సిన జై సింహా.. మూలిగినట్టుంది.
దర్శకుడు కె.యస్ రవికుమార్ రాత-తీతలోనూ కొత్తదనం కనిపించలేదు. కథానాయకుడు మరోచోట తలదాచుకొనే ట్రెండు చాలా పాతది. పోనీ దాంట్లో కొత్తగా ట్విస్టులు ఏమైనా ఉన్నాయా ? అంటే అవీ లేవు. ఇక, నటనలో బాలయ్యకు వంక పెట్టలేం. యాక్షన్, సెంటిమెంట్ సీన్స్ తో పాటు ఈసారి డ్యాన్సుల్లోనూ అదరగొట్టాడు. ఉన్నంతలో ఈ సినిమాకి డైలాగ్స్ సగం బలం. ఈ సినిమా ఏమాత్రం ఆడినా, ఎన్ని కలెక్షన్స్ రాబాట్టిన అది కేవలం బాలయ్య క్రిడిట్ మాత్రమే. హీరోయిన్స్ లో నయనతార నటనతో ఆకట్టుకొంది. సెంటిమెంట్ సీన్స్ లో ఏడుపు తెప్పించింది. మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ పెద్దగా చేసేందేమీ లేదు. మురళీ మోహన్, విలన్ బ్యాచ్ ఓకే అనిపించింది. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.
టెక్నికల్ గా :
కథ కాస్త పాతదే అన్నప్పుడు కథనంలో కొత్తదనం చూపించాల్సి ఉంటుంది. కానీ, ఆ ప్రయత్నాలేవీ చేయలేదు దర్శకుడు. ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఫైట్ లో భాగంగా బాలయ్య చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకొన్నాయి. చిరంతన్ భట్ అందించిన పాటల్లో అమ్మకుట్టి సాంగ్ బాగుంది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో కత్తెర పెట్టాల్సిన సీన్స్ చాలానే ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బాటమ్ లైన్ :
‘జై సింహా’.. అక్కడక్కడ మాత్రమే అరుపులు, మెరుపులు !