టీటీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలి…! : మోత్కుప‌ల్లి

టీటీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ వ‌ర్దంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో నివాళుల‌ర్పించిన ఆయ‌న అనంత‌రం చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. తెలంగాణ‌లో టీడీపీ లేద‌నిపించుకునే కంటే పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయ‌డం మంచిద‌ని, ఇది త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మ‌ని ఆయ‌న అన్నారు.

సీఎం కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వెళ్లిన వాడేన‌ని, టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంద‌ని, ఇది చంద్ర‌బాబుకు తాను వ్య‌క్తిగ‌తంగా ఇస్తున్న‌స‌ల‌హా అని ఆయ‌న అన్నారు. ఈ విష‌యాన్ని ఆలోచించాల్సిందిగా ఆయ‌న‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు.

తెలంగాణ‌లో టీడీపీని భుజాల మీద మోసి నిల‌బెడ‌దామ‌న్నా స‌హ‌క‌రించేవారు లేర‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మోత్కుప‌ల్లి వ్యాఖ్య‌ల‌తో పార్టీలో క‌ల‌క‌లం మొద‌లైంది. ఆయ‌న వ్యాఖ్య‌ల వెన‌క ఉద్దేశం ఏముందోన‌నే చ‌ర్చ‌జ‌రుగుతోంది.