వ్య‌క్తిగ‌త‌మంటూనే చంద్ర‌బాబుపై మోత్కుప‌ల్లి విమ‌ర్శ‌లు !!

టీటీపీ సీనియ‌ర్ నాయ‌కులు మోత్కుప‌ల్లి పార్టీ అధినేత‌పై వాగ్భానాలు విసిరారు. పార్టీ ఓట‌ర్ల‌ను కాపాడుకోవ‌డానికి టీటీపీని అధికార టీఆర్ఎస్ లో విలీనం చేయాల‌ని ఆయ‌న ఆవేద‌న‌తో మాట్లాడారు. తెలంగాణ‌లో పార్టీ అంత‌మైంద‌నే అప‌వాదు కంటే స్నేహితుడికి సాయం చేసిన‌ట్టుగా ఉంటుంద‌నే కీర్తి చంద్ర‌బాబుకుంటుంద‌ని అన్నారు మోత్కుప‌ల్లి.

పార్టీని భుజాన ఎత్తుకుని కాపాడుకుందామ‌నుకున్నా స‌హ‌క‌రించేవారు లేర‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. పార్టీని కాపాడుకోవాలంటే చంద్ర‌బాబే తెలంగాణ‌లో ర‌థ‌యాత్ర చేయాల‌ని, ఆయ‌న‌కు స‌మ‌యం లేక‌పోవ‌డం వ‌ల్ల అదిసాధ్యం కాద‌ని, అందుకే పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ ప‌రోక్షంగా చంద్ర‌బాబుపై విమర్శ‌ల వ‌ర్షం కురిపించారు. వ్య‌క్తిగ‌త‌మంటూనే పార్టీ అధినేత‌ను విమ‌ర్శిస్తూ వ‌చ్చారు మోత్కుప‌ల్లి.

తెలంగాణ‌లో టీడీపీ నేత‌లు మాన‌సిక క్షోభ అనుభ‌విస్తున్నార‌న్నారాయ‌న‌. ఎన్టీఆర్ వ‌ర్ధంతిరోజున హైద‌రాబాద్ కు వ‌చ్చి చంద్ర‌బాబు నివాలులు అర్పిస్తే బాగుండేద‌ని, ఎన్టీఆర్ స‌మాధి హైదారాబాద్ లో ఉంది కాబ‌ట్టి ఆయ‌న వ‌చ్చి ఉంటే బాగుండేద‌న్నారు. అంద‌రికీ న్యాయం జ‌ర‌గాలంటే టీఆర్ఎస్ లో పార్టీని విలీనం చేయ‌డ‌మే మంచిద‌న్నారు. తాను ప‌ద‌వుల కోసం ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం లేద‌ని చెప్పారు మోత్కుప‌ల్లి. మొత్తంగా పార్టీ అధినేత‌నే టార్గెట్ గా వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు మోత్కుప‌ల్లి.