సందిగ్ధంలో ప‌డ్డ టీటీడీపీ నేత‌లు..!!

టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు వ్యాఖ్య‌లు ఆ పార్టీలో పెద్ద దుమార‌మే లేపాయి. అనుకోని ఈ ప‌రిణామానికి టీటీడీపీ నేత‌లు ఘాటుగా స్పందిస్తున్నారు. మోత్కుపల్లి ఎమోషన్ తో మాట్లాడినట్లు ఉన్నారని, జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం అవుతుందని అంటున్నారు ఆ పార్టీ నేత‌లు. విలీనం చేసి ఏపీ లో అధికారాన్ని టిఆర్ఎస్ కు ఇవ్వాలా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ వల్ల కేడర్ నైరాశ్యం లోకి వెళ్తారని, చెప్పుకొస్తున్నారు.

నేత‌లు లేక‌పోయినా పార్టీకి కార్య‌క‌ర్త‌లే బ‌ల‌మ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసి తీర‌తామ‌ని టీటీడీపీ అధ్య‌క్షుడు తేల్చి చెబుతున్నారు. అయితే మోత్కుప‌ల్లి కామెంట్స్ పై పార్టీ ఎలాంటిచ‌ర్య‌లు తీసుకుంటుంద‌నే దానిపై స్ప‌ష్ట‌త‌నివ్వ లేక‌పోతున్నారు. వ్య‌క్తిగ‌తంగా మాట్లాడినా పార్టీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేలా మాట్లాడినందుకు క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాలా? వ‌ద్దా? .. ఒక‌వేళ తీసుకుంటే కార్య‌క‌ర్త‌ల్లో , ప్ర‌జ‌ల్లో ఎలాంటి సంకేతాలు వెళ‌తాయ‌నే ఆలోచ‌న‌లో ప‌డ్డారు. చంద్ర‌బాబును క‌లిసిన త‌రువాత ఫైన‌ల్ గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని యోచిస్తున్నారు నేత‌లు.. మొత్తంమీద మోత్కుప‌ల్లి తాజా కామెంట్స్ తో ఆ పార్టీ నేత‌లు సందిగ్ధంలో ప‌డిపోయిన‌ట్లు క‌నిపిస్తోంది..