యువత, మహిళలను టార్గెట్ చేసిన పవన్
తెలంగాణలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర కొనసాగుతోంది. బుధవారం ఆయన ఖమ్మంలో నల్గొండ, ఖమ్మం , వరంగల్ జిల్లా కార్యకర్తలతో సమావేశమయ్యారు. తన రాజకీయ జెండా-అజెండాపై కార్యకర్తలకు స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తనకు వ్యక్తిగతంగా కాంగ్రెస్ నేతలపై ఎలాంటి వ్యతిరేకత లేదని మరోసారి స్పష్టం చేశారు. జై తెలంగాణ అనడం తనకు ఇష్టం. తాను రాజకీయాల్లోకి రావడానికి నల్గొండలోని ఫ్లోరైడ్ సమస్య కూడా ఒకటని తెలిపారు.
మొత్తంగా పవన్ ప్రయత్నమంతా యువత, మహిళలని ప్రభావితం చేయడమే లక్ష్యంగా కనిపించింది. పవన్ చెప్పే ఆదర్శ రాజకీయాలు ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో వర్కవుట్ కావు అన్న సంగతి అందరికీ తెలుసు. కాకపోతే, ఆదర్శ రాజకీయాలపై ఆలోచించే యువత దేశంలో ఉంది. అలాంటి వాళ్లే పవన్ కు కావాలి. వారంతా ముందుకు రావాలి. కులం, మతం. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లేని రాజకీయాలు కావాలని ఆశపడే యువత. మహిళా స్వతంత్రం కోరుకొనే మహిళలే జనసేనాని అస్త్రాలుగా కనబడుతున్నారు.
వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు స్వయంగా ప్రయత్నం చేయకపోయినా ఫర్వాలేదు. ఆ ప్రయత్నం చేసే వారిని ప్రొత్సహించిన సరిపోతుందేమో.. ! అలాగని.. మేం ఇక్కడ ఆంద్ర, తెలంగాణ అనే విబేధాలని లేవనెత్తడం లేదు. కేవలం పవన్ ఆలోచన విధానాన్ని మాత్రమే చెప్పదలచుకొన్నాం. గమనించగలరు.. !!