దావోస్’లో పెట్టుబడుల వేట

దావోస్ వేదికగా “వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్” సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనేందుకు ప్రపంచ దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు ఏపీ మంత్రి నారా లోకేష్, ఇక, తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఐతే, తెలుగు నేతలు రాష్ర్టానికి పెట్టుబ‌డులు ఆహ్వానించ‌డ‌మే ల‌క్ష్యంగా భేటీల్లో పాల్గొంటున్నారు.

ప్రఖ్యాత అమెరికా కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్‌తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ ఆంబ్రూస్’తో చర్చలు జరిపారు. ఎరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో దేశంలోనే తెలంగాణ‌ ప్రధాన కేంద్రంగా మారుతోందని తెలియజేశారు. హైదరాబాద్‌కు చెందిన చిన్న, మధ్య తరహా సంస్థలు కీలకమైన కంపోనెంట్లను ఎలా ఉత్పత్తి చేస్తున్నాయన్న అంశాన్ని మంత్రి లాక్‌హీడ్ ప్రతినిధికి వివరించారు. హైదరాబాద్‌లో సంస్థను స్థాపించడానికి కావాల్సిన అంశాలను విశ్లేషించుకోవాలని లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ ప్రతినిధి రిచర్డ్ ఆంబ్రోస్‌కి మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారు.